Omicron surge: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరిక లేఖ

1 Jan, 2022 19:33 IST|Sakshi

Highest ever surge in world న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు శర వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో తమ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను తక్షణమే సమీక్షించాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం శనివారం లేఖలు రాసింది. ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, హెల్త్‌ కేర్‌ సౌకర్యాలను పెంచడంతోపాటు ఆక్సిజన్ లభ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని సెక్రెటరీ రాజేష్‌ భూషణ్‌ లేఖల్లో పేర్కొన్నారు.  

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం నిన్న ఒక్క రోజులోనే (డిసెంబర్ 31న) అత్యధికంగా 16,764 కేసులు దేశంలో నమోదయ్యాయి. గత 70 రోజులతో పోల్చితే పెద్ద మొత్తంలో నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు ఐరోపా, అమెరికా దేశాలు గత కొన్ని వారాల్లో కొత్త కేసులు గణనీయంగా పెరిగినట్లు నివేదించాయి. తాజా పరిణామాలన్నీ కూడా వైరస్‌ అధిక వ్యాప్తినే సూచిస్తున్నాయని సెక్రెటరీ లేఖలో ఉటంకించారు. 

చదవండి: 12,580 ఎన్జీవోల లైసెన్సులు రద్దు! ఇక నో ఫారిన్‌ ఫండ్స్‌..

శనివారం ఉదయం నాటికి దేశంలో మిక్రాన్ సంఖ్య 1,431 మార్క్‌ను దాటింది. 5 రాష్ట్రాల్లో 100 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అలాగే 22,775 కోవిడ్‌ కేసులు నమోదుకాగా, 406 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నందువల్ల హెల్త్‌ కేర్‌ ఫెసిలీటీస్‌ కొరత ఏర్పడవచ్చని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తాత్కాలిక ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కోరింది. తేలికపాటి నుండి మితమైన లక్షణాలున్న రోగుల కోసం రాష్ట్రాలు హోటల్ వసతిని కూడా వినియోగించుకోవచ్చని పేర్కొంది.హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న రోగులను పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలు, కాల్ సెంటర్లు, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలి రాష్ట్రాలను కోరింది. గ్రామీణ ప్రాంతాలు, పీడియాట్రిక్ కేసులపై కూడా స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాలన్నారు. 

జ్వరాలు, ఒళ్లు నొప్పులతో వస్తున్న రోగులందరికీ కోవిడ్‌ టెస్ట్‌లుచేయాలని కోరింది. అంతేకాకుండా చాలా మంది ఒమిక్రాన్‌ రోగులు లక్షణరహితంగా ఆసుపత్రిలో చేరకుండానే కోలుకుంటున్నారు. ఐతే రోగులను సకాలంలో గుర్తించకపోతే, కుటుంబ సభ్యులకు సంక్రమణ ప్రమాదం ఎక్కువని తెల్పింది. ఈ మేరకు కోవిడ్‌ కేసులు ఆకస్మికంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

చదవండి: మైనింగ్‌ జోన్‌లో విరిగిపడ్డ కొండ చిరియలు.. 20 మంది కార్మికులు గల్లంతు!

>
మరిన్ని వార్తలు