పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం వద్దు

18 Jan, 2021 06:22 IST|Sakshi

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన

ఇప్పటిదాకా 11 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ

న్యూఢిల్లీ: బర్డ్‌ఫ్లూ(ఎవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా) కారణంగా మహారాష్ట్ర, హరియాణాలో పౌల్ట్రీ కోళ్ల వధ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. మహారాష్ట్రలోని ముంబైలో, మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్‌లో కొత్తగా బర్డ్‌ఫ్లూ కేసులు బయటపడ్డాయని తెలిపింది. ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, గుజరాత్‌లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యింది. పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించడం సరికాదని, దీనిపై పునరాలోచించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వ్యాధి ప్రభావం లేని రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవచ్చని వెల్లడించింది.

ఈ మేరకు కేంద్ర పశు సంవర్థక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బర్డ్‌ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో కోళ్లలోనే కాకుండా కాకులు, గుడ్లగూబలు, పావురాలలో ఈ వ్యాధి ఆనవాళ్లు బయటపడ్డాయని పేర్కొంది. బర్డ్‌ఫ్లూపై అనుమానం ఉంటే సమాచారం అందించడానికి మహారాష్ట్ర పశు సంవర్థక శాఖ టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం బర్డ్‌ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. తాజా పరిస్థితిపై అధ్యయనం చేస్తోంది. ఈ వ్యాధిపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, గందరగోళానికి గురికావొద్దని కేంద్ర పశు సంవర్థక శాఖ కోరింది. తప్పుడు ప్రచారం వల్ల పౌల్ట్రీ పరిశ్రమతోపాటు రైతులు సైతం నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు