ఢిల్లీ–కేంద్రం వివాదం.. రాజ్యాంగ ధర్మాసనానికి

7 May, 2022 06:07 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రభుత్వ సివిల్‌ అధికారులపై ఆజమాయిషీ ఎవరికి ఉండాలనే అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తలెత్తిన వివాదాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల శాసన, కార్యనిర్వాహక అధికారాల పరిధిని మాత్రమే ధర్మాసనం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. ఈ నెల 11వ తేదీన విచారణ ప్రారంభమవుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లిల ధర్మాసనం శుక్రవారం పేర్కొంది.

‘క్యాట్‌’ ఖాళీలు భర్తీ చేయండి
కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ (క్యాట్‌)లో ఖాళీల పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వాటిని ఇంకా భర్తీ చేయకపోవడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేవలం ఒక్క సభ్యుడితో ధర్మాసనాన్ని ఏర్పాటు చేయలేమని జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి నోటీసు జారీ చేసింది. క్యాట్‌కు చెందిన జబల్పూర్, కటక్, లక్నో, జమ్మూ, శ్రీనగర్‌ బెంచ్‌లలో కేవలం ఒక్కో సభ్యుడే ఉన్నారని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. క్యాట్‌లో ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ క్యాట్‌ (ప్రిన్సిపల్‌ బెంచ్‌) బార్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

...న్యాయ వ్యవస్థకు అగౌరవం
భూ సేకరణ వ్యవహారంలో తీర్పు ముసుగులో కక్షిదారుకు అనుచితమైన లబ్ధి కలిగించడం న్యాయ వ్యవస్థను అగౌరవపర్చడం, దుష్ప్రవర్తన కిందకే వస్తుందని జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాంటి తీర్పు ఇచ్చిన యూపీలోని ఆగ్రా మాజీ అదనపు జిల్లా జడ్జీ ముజఫర్‌ హుస్సేన్‌ ఉద్దేశాన్ని అనుమానించాల్సిందేనని పేర్కొంది. ముజఫర్‌ హుస్సేన్‌ దురుద్దేశపూర్వకంగా తీర్పు ఇచ్చారని అలహాబాద్‌ హైకోర్టు గతంలో తేల్చిచెప్పింది. జరిమానా కింద అతడి పెన్షన్‌లో 90 శాతం కోత విధించింది. దీన్ని సవాలు చేస్తూ ముజఫర్‌ హుస్సేన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. ‘‘ప్రజా సేవకులు నీటిలోని చేపల్లాంటి వారు. నీటిలో చేపలు ఎప్పుడు, ఎలా నీళ్లు తాగుతాయో ఎవరూ చెప్పలేరు’’ అని వ్యాఖ్యానించింది.  

ఆజం బెయిల్‌ ఆలస్యంపై అసంతృప్తి
సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు ఆలస్యం కావడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది న్యాయాన్ని అవహేళన చేయడమేనంటూ జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. భూ ఆక్రమణ కేసులో బెయిల్‌ దరఖాస్తుపై విచారణ పూర్తి చేసిన అలహాబాద్‌ హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచినట్లు ఆజం ఖాన్‌ తరఫు న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. ఆయనపై 87 కేసులకు గాను 86 కేసుల్లో బెయిల్‌ మంజూరైందన్నారు. ‘‘ఒక్క కేసులో బెయిల్‌కు ఇంత జాప్యమా? ఇది న్యాయాన్ని అవహేళన చేయడమే. ఇంతకు మించి ఏమీ చెప్పలేం. దీనిపై బుధవారం విచారణ చేపడతాం’అని పేర్కొంది. ఆజం ఖాన్‌ ప్రస్తుతం సితాపూర్‌ జైలులో ఉన్నారు. 

మరిన్ని వార్తలు