రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. రంగంలోకి భారీగా పారామిలిటరీ

5 Jan, 2023 07:20 IST|Sakshi

శ్రీనగర్‌:  రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్రదాడులు.. ఆరుగురి దుర్మరణం.. ఇందులో ఇద్దరు చిన్నారులు.. పదుల సంఖ్యలో గాయపడడంతో సరిహద్దు జిల్లా రాజౌరిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. హిందూ కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చెలరేగిపోతుండడంతో.. భద్రతాపరంగా అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతోందని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 

రాజౌరి జిల్లాలో భారీగా పారామిలిటరీ ట్రూప్స్‌ను మోహరిస్తోంది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. ఇప్పటికే సీఆర్‌పీఎఫ్‌ తరపున 18వేల సిబ్బంది రంగంలోకి దిగారు. గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బలగాలు రాజౌరీలో మోహరించగా.. మరికొన్ని కంపెనీలు జమ్ముకి బయల్దేరాయి. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ఎరివేతే లక్ష్యంగా సైన్యం, స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌తో కలిసి ఈ జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. జమ్ము కశ్మీర్‌లో ఇప్పటికే సీఆర్‌ఎఫ్‌ బలగాలు ఉనికి భారీగా ఉంది. డెబ్భైకి పైగా బెటాలియన్లు(మొత్తం సీఆర్‌ఎఫ్‌ బలగాల సామర్థ్యంలో 3వ వంతు) జమ్ము కశ్మీర్‌లోనే భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.

ఇక రాజౌరి జిల్లా ఉప్పర్‌ డాంగ్రీ గ్రామంలో.. ఆదివారం సాయంత్రం ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఆ మరుసటి రోజే ఉగ్రవాదుల కోసం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు పాతిన ఐఈడీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులను చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. నెల వ్యవధిలో ఇది మూడో ఉగ్రదాడి ఘటన.  గత నెలలో ఆర్మీ క్యాంప్‌ సమీపంలోనే ఇద్దరిని ఉగ్రవాదులు కాల్చి చంపారు.

హిందూ కుటుంబాల నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండడంతో.. చాలా మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికారులు భద్రతకు తమది హామీ అని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ జరుగుతోంది.

మరిన్ని వార్తలు