ప్రాజెక్టుల నిర్వహణపై రెండు రాష్ట్రాలతో చర్చించండి: గోదావరి బోర్డుకు జల శక్తి శాఖ సూచన 

26 Nov, 2021 03:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నదీ బేసిన్‌లో చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణపై ఇరు రాష్ట్రాలతో చర్చించి పరస్పర అంగీకారంతోనే ముందుకెళ్లాలని గోదా వరి బోర్డుకు కేంద్ర జల శక్తి శాఖ సూచించింది. నిర్వహణ పరమైన అంశాలేవైనా ఇరు రాష్ట్రాలతో చర్చించే తుది నిర్ణయాలు చేయాలని తెలిపింది. ఇటీవలి గోదావరి బోర్డు సమావేశాల్లో గెజిట్‌ నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొన్న వన్‌ టైమ్‌ సీడ్‌ మనీ, అసెట్‌ ట్రాన్స్‌ఫర్‌ (ఆస్తుల బదిలీ), రెవెన్యూ యుటిలైజేషన్‌ (ఆదాయ వినియోగం)లపై రాష్ట్రాలు మరింత స్పష్టత కోరిన నేపథ్యంలో బోర్డు దీనిపై గతంలో జలశక్తి శాఖకు లేఖ రాసింది.

దీంతో జలశక్తి శాఖ ఈ మూడు అంశాలపై స్పష్టతనిస్తూ గురువారం ప్రత్యుత్తరం పంపింది. అవార్డులకు లోబడి నీటి నిర్వహణ: అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం–1956లో భాగంగా ఏర్పాటైన ట్రిబ్యునళ్లు వెలువరించిన అవార్డులకు లోబడి నీటి నిర్వహణ ఉండాలని జలశక్తి శాఖ తెలిపింది. లేనిపక్షంలో రెండు రాష్ట్రాల మధ్య ఏవైనా ఒప్పందాలు జరిగి ఉంటే వాటికి అనుగుణంగా నీటి పంపిణీ ఉండాలని సూచించింది. విద్యుత్‌ సరఫరా విషయంలోనూ ఇదే సూత్రం పనిచేస్తుందని వెల్లడించింది.

ఇక వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమగ్రంగా చర్చించాలని సూచించింది. ఈ చర్చల్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే డ్యామ్‌లు, రిజర్వాయర్లు వంటి ఆస్తుల బదిలీపై బోర్డు తదుపరి చర్యలు ఉండాలని పేర్కొంది. రెండు రాష్ట్రాలు చెరో రూ.200 కోట్ల చొప్పున వన్‌ టైమ్‌ సీడ్‌ మనీ కింద గోదావరి బోర్డు బ్యాంకు ఖాతాలో జమ చేయాలని స్పష్టంగా పేర్కొన్నందున, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.     

మరిన్ని వార్తలు