చర్చల్లో ప్రతిష్టంభన.. పట్టువీడని రైతులు

6 Dec, 2020 03:03 IST|Sakshi
చర్చల అనంతరం ‘యస్‌ ఆర్‌ నో’ అని ఉన్న ప్లకార్డు చూపుతున్న రైతు నేత

సాగు చట్టాల రద్దు డిమాండ్‌పై సమయం కోరిన కేంద్రం

ఎటూ తేలకుండానే 9కి వాయిదా

భారత్‌ బంద్‌కు విపక్షాల మద్దతు

న్యూఢిల్లీ : ఆందోళన బాట పట్టిన రైతు సంఘాలతో కేంద్రం జరుపుతున్న చర్చలు మరోసారి ఎటూ తేలకుండానే ముగిశాయి. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో వ్యవసాయ చట్టాల రద్దుపైనే రైతు సంఘాల ప్రతినిధులు ప్రధానంగా పట్టుబట్టారు. అయితే, నిర్దుష్ట ప్రతిపాదనలు చేసేందుకు కేంద్రం 9వ తేదీ వరకు సమయం కోరింది. దీంతో 11 రోజులుగా దేశ రాజధాని కేంద్రంగా చేపట్టిన రైతు సంఘాల ఆందోళన మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధనకు 8వ తేదీన రైతు సంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు పలు ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.

ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రులు, 40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ఐదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. దాదాపు 4 గంటలపాటు జరిగిన చర్చలకు కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నాయకత్వం వహించారు. చర్చల్లో రైల్వేలు, వాణిజ్యం, ఆహారం శాఖల మంత్రి పీయూష్‌ గోయల్, పంజాబ్‌కు చెందిన ఎంపీ, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు. గత సమావేశాల్లో చర్చల సందర్భంగా హామీ ఇచ్చిన అంశాలపై కేంద్రం తీసుకున్న చర్యలను వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌ వారికి వివరించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చర్చల ప్రారంభం సందర్భంగా పంజాబీలో మంత్రి సోమ్‌ ప్రకాశ్‌ వారికి తెలిపారు.

ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు గట్టిగా పట్టుబడ్డారు.  స్పష్టమైన హామీ లభించకుంటే బయటకు వెళ్లిపోతామంటూ తెగేసి చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందనీ, వారి సమస్యలను పరిష్కరిస్తామని దీంతో మంత్రులు వారికి సర్దిచెప్పారు. అయితే, సాగు చట్టాల రద్దు విషయం తేల్చాలంటూ రైతు ప్రతినిధులు గంటపాటు మౌనవ్రతం సాగించారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు, అంతర్గతంగా చర్చలు జరిపి నిర్దిష్ట ప్రతిపాదనలు తయారు చేసేందుకు ఈ నెల 9 వరకు సమయం కావాలని ప్రభుత్వ ప్రతినిధులు కోరారు. దీంతో చర్చలు ఎటూ తేలకుండానే వాయిదా పడ్డాయి. 

ఆహారం, టీ వెంట తెచ్చుకున్న రైతులు
ఢిల్లీ సరిహద్దుల్లో సింఘూ వద్ద ఆందోళన సాగిస్తున్న ప్రాంతం నుంచి చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు ఆహారం, టీ తమతోపాటు తెచ్చుకున్నారు. గురువారం కూడా రైతులు ఆహారం, టీతోపాటు మంచినీరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.  

రైతు ప్రతినిధుల సూచనలు కోరాం: తోమర్‌
చర్చల అనంతరం మంత్రి తోమర్‌ మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాల నేతల నుంచి నిర్దిష్ట సూచనలను కోరాం.  అయితే, చలి తీవ్రత దృష్ట్యా ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధులు, మహిళలు, పిల్లల్ని ఇళ్లకు పంపించాలని కోరాం’అని తెలిపారు.

వివిధ పార్టీలు..సంఘాల మద్దతు
8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపునకు కాంగ్రెస్‌తోపాటు ఆర్జేడీ, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆర్‌ఎస్‌పీ, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తదితర వామపక్షాలు, డీఎంకే మద్దతు ప్రకటించాయి.  బంద్‌కు 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక మద్దతుగా నిలిచింది. రైతులకు మద్దతుగా పంజాబ్‌కు చెందిన పలువురు మాజీ క్రీడాకారులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు తమ పద్మశ్రీ, అర్జున అవార్డులను వాపసు చేసేందుకు ఢిల్లీకి బయలుదేరారు.  

రహదారులే గ్రామాలుగా...  
ఢిల్లీకి వెళ్లే కీలక రహదారులపై రైతులు నిరసలు తెలుపుతుండటంతో గడిచిన 10 రోజులుగా ఈ మార్గాల్లో ట్రాపిక్‌ జాంలు పెరిగిపోయాయి. దీంతో పోలీసులు కొన్ని మార్గాలను మూసివేసి, మరికొన్ని రోడ్లలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. దీర్ఘకాలం పోరుకు రైతులు సమాయత్తం అవుతుండటంతో కొన్ని రోడ్లు గ్రామాలుగా మారిపోయాయి. రైతులు రోడ్లపైనే ట్రాక్టర్లు నిలిపి, వాటిపై టెంట్లు వేసుకున్నారు. అక్కడే వంటావార్పూ చేపట్టారు. అవసరమైన సరుకులు, కాయగూరలు వంటివి అక్కడికి అందుతున్నాయి. సెల్‌ఫోన్లకు సోలార్‌ ప్యానళ్లతో చార్జింగ్‌ చేసుకుంటున్నారు. ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధుల కోసం కొందరు వైద్యులు వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేశారు. వృద్ధులు హుక్కా పీలుస్తూ కాలం గడుపుతున్నారు.

చర్చలకు ముందు ప్రధానితో భేటీ
రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలకు వెళ్లేముం దు మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌లు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రైతుల ముందుంచబోయే ప్రతిపాదనలపై వారంతా కలసి చర్చించినట్లు సమాచారం. రైతుల ఆందోళనలపై కేంద్ర మంత్రులతో ప్రధాని చర్చలు జరపడం ఇదే మొదటి సారి.

రైతు ప్రతినిధుల మౌనవ్రతం
చర్చల సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతు సంఘాల ప్రతినిధులంతా మౌనవ్రతం పాటించారు. ప్రధానమైన ఈ డిమాండ్‌ కేంద్రానికి సమ్మతమా కాదా స్పష్టం చేయాలని కోరుతూ ప్రతినిధులు అవును/ కాదు అని రాసి ఉన్న కాగితాలను వారు నోటికి అతికించుకున్నారని పంజాబ్‌ కిసాన్‌ యూనియన్‌ నేత రుల్ధు సింగ్‌ తెలిపారు. ప్రభుత్వం వారిని మాట్లాడించేందుకు మౌనంతోనే సమాధానం చెప్పారని మరో నేత కవితా కురుగంటి వెల్లడించారు. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు. సాగు చట్టాలకు ప్రభుత్వం పలు సవరణలు చేస్తామంటూ ముందుకు వచ్చిందనీ, తాము మాత్రం పూర్తిగా రద్దు చేయాలని కోరామని బీకేయూ ఏక్తా అధ్యక్షుడు జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌ చెప్పారు.


శనివారం సింఘూ వద్ద జరిగిన ధర్నాలో నినదిస్తున్న రైతుల పిల్లలు


చర్చల విరామ సమయంలో వెంట తెచ్చుకున్న ఆహారం తింటున్న రైతు సంఘాల ప్రతినిధులు

మరిన్ని వార్తలు