రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు వడ్డీలేని రుణం: కేంద్రం

1 May, 2021 01:07 IST|Sakshi

రూ.15 వేల కోట్లు మూలధన వ్యయం సమకూర్చనున్న కేంద్రం

కేంద్ర పన్నులలో వాటి దామాషా ప్రకారం కేటాయింపు

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలకు మూల ధన వ్యయం కింద రూ.15 వేల కోట్లు సమకూర్చనున్నట్లు కేంద్రం తెలిపింది. 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణం కింద రూ.15 వేల కోట్లు అదనపు మొత్తాన్ని సమకూర్చాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఆర్థిక శాఖ వ్యయ విభాగం ఇందుకు సంబంధించి రాష్ట్రాలకు ఆర్థిక సహాయం పేరుతో 2021–22 సంవత్సరానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం కింద వడ్డీ లేకుండా 50 సంవత్సరాల రుణం రూపంలో ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తారు. దీనికోసం 2020–21 సంవత్సరానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. దీంట్లో రూ.11,830 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేశారు.

గత సంవత్సరం కోవిడ్‌ మహమ్మారి కాలంలో రాష్ట్రస్థాయిలో మూలధన వ్యయానికి ఇది సహాయపడింది. ఈ పథకానికి వచ్చిన సానుకూల స్పందనను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ పథకాన్ని 2021–22 సంవత్సరానికి కూడా కొనసాగించాలని నిర్ణయించింది. ప్రత్యేక సహాయ పథకం కింద మూడు విభాగాలు ఉన్నాయి. మొదటి విభాగం ఈశాన్య, కొండప్రాంత రాష్ట్రాలకు సంబంధించినది. ఈ విభాగానికి రూ. 2,600 కోట్ల రూపాయలు కేటాయించారు. రెండో విభాగంలోని రాష్ట్రాల కోసం రూ. 7,400 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తాన్ని 15వ ఆర్థిక సంఘం అవార్డు మేరకు కేంద్రపన్నులలో వాటి దామాషా ప్రకారం కేటాయిస్తారు.

మూడో విభాగం కింద రాష్ట్రాలకు మానిటైజేషన్, మౌలిక సదుపాయాల ఆస్తుల రీసైక్లింగ్, పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ (ఎస్‌పీఎస్‌ఈసీ)ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు ప్రోత్సాహకం అందజేస్తారు. ఈ విభాగం కింద ఈ పథకానికి రూ.5 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రాలు అసెట్‌ మానిటైజేషన్, లిస్టింగ్, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూర్చుకున్న దానిలో 33 శాతం నుంచి 100 శాతం వరకు మొత్తాన్ని 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణంగా పొందుతాయి.   

చదవండి: (కరోనా సంక్షోభం: 16 ఏళ్ల తర్వాత భారత్‌లో కీలకమార్పు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు