ఆర్మీలో మహిళా అధికారుల శాశ్వత కమిషన్‌

24 Jul, 2020 04:08 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన రక్షణ శాఖ

న్యూఢిల్లీ: ఆర్మీలో మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. షార్ట్‌ సర్వీసు కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కింద రిక్రూట్‌ చేసే మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్‌కు తీసుకురావాలంటూ గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పడం తెల్సిందే. ఈ తీర్పు మేరకు రక్షణ శాఖ శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

ఈ కమిషన్‌ ద్వారా ఆర్మీలో మహిళలు విస్తృతమైన పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుందని, మహిళా సాధికారతకు బాటలుపడతాయని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్‌ అమన్‌ ఆనంద్‌ చెప్పారు. ఇండియన్‌ ఆర్మీలోని అన్ని విభాగాల్లోనూ షార్ట్‌ సర్వీసు కమిషన్డ్‌ కింద ఉన్న మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్‌ కిందకు తీసుకువస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినట్టు కల్నల్‌ వెల్లడించారు.

ఇకపై ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్, సిగ్నల్స్, ఇంజనీర్లు, ఆర్మీ ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌ ఇంజనీర్లు, ఆర్మీ సర్వీసు కార్పొరేషన్, ఇంటెలిజెన్స్‌ కార్పొరేషన్‌ వంటి విభాగాల్లో పని చేసే మహిళలంతా శాశ్వత కమిషన్‌ కింద నియామకాలే జరుగుతాయి. ఎస్‌ఎస్‌సీ కింద ఉన్న వారంతా శాశ్వత కమిషన్‌ కింద మారే డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ త్వరలో చేపట్టనున్నారు. ఎస్‌ఎస్‌సీ కింద నియమించే వారిని తొలుత అయిదేళ్లకు నియమిస్తారు.ఆ తర్వాత వారి సర్వీస్‌ను 14 ఏళ్లకు పెంచే అవకాశం ఉంటుంది. శాశ్వత కమిషన్‌ ద్వారా మహిళలంతా పదవీ విరమణ వయసు వరకు సర్వీసులు కొనసాగుతారు.

మరిన్ని వార్తలు