నవంబర్‌ 26లోపు దిగిరావాలి.. లేకుంటే...

1 Nov, 2021 16:08 IST|Sakshi

కేంద్ర సర్కారుకు రైతుల అల్టిమేటం

27 నుంచి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక

మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నవంబర్ 26లోగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకుంటే ఢిల్లీ సరిహద్దులో నిరసనలు ఉధృతం చేస్తామని రైతు నాయకుడు రాకేష్ టికాయిత్‌ హెచ్చరించారు. కేంద్ర సర్కారు తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళనలు మొదలై దాదాపు ఏడాది కావొస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఈ అల్టిమేటం జారీచేశారు. 


‘కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 26 వరకు సమయం ఇస్తున్నాం. నవంబర్ 27 నుంచి రైతులు గ్రామాల నుంచి ట్రాక్టర్లలో ఢిల్లీ చుట్టుపక్కల జరుగుతున్న నిరసన ప్రదేశాల వద్దకు చేరుకుంటారు. భారీ సంఖ్యలో తరలివచ్చే రైతులతో నిరసన ప్రదర్శనలు మరింత ఉధృతం అవుతాయ’ని రాకేష్ టికాయిత్‌  పేర్కొన్నారు. (చదవండి: పెరుగుతున్న పెట్రోలు ధర.. నిండుతున్న కేంద్ర ఖజానా)


రైతు సంఘాల నుంచి గత రెండు రోజుల్లో కేంద్రానికి జారీ అయిన రెండో హెచ్చరిక ఇది. ఢిల్లీ సరిహద్దుల నుంచి నిరసనకారులను బలవంతంగా తరలించేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వ కార్యాలయాలను ధాన్యం మార్కెట్‌గా మారుస్తామని ప్రభుత్వాన్ని ఆదివారం రాకేష్ టికాయిత్‌ హెచ్చరించారు. నిరసన స్థలంలో తమ గుడారాలను తొలగించడానికి ప్రత్నిస్తే.. పోలీసు స్టేషన్లు, కలెక్టరేట్ల వద్ద టెంట్లు వేస్తామన్నారు. 

గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు చట్టాలు తమ ప్రయోజనాలను  దెబ్బతీసేవిధంగా ఉన్నాయని పేర్కొంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. గత ఏడాది నవంబర్ 26 నుంచి రైతులు.. తిక్రీ, సింగు, ఘాజీపూర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్నారు. కేంద్ర సర్కారు మాత్రం ఈ చట్టాలు రైతులకు అనుకూలమని వాదిస్తోంది. కేంద్రం, రైతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా ఫలించలేదు. (చదవండి: ఎయిరిండియా జాతీయీకరణ ఒక భారీ కుట్ర!)

మరిన్ని వార్తలు