ఆ రాష్ట్రాల్లో భారీగా కరోనా కొత్త కేసులు.. కేంద్రం హైఅలర్ట్‌, అన్ని రాష్ట్రాలకూ హెచ్చరికలు

25 Mar, 2023 16:23 IST|Sakshi
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ

సాక్షి, ఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో.. హైఅలర్ట్‌ ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కరోనా అలర్ట్‌ జారీ చేసింది. కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీచేసింది. 

దేశంలో కేసులు పెరుగుతున్న వేళ.. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఎల్లుండి(సోమవారం) రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నుట్లు తెలుస్తోంది. అలాగే.. ఏప్రిల్‌ 10, 11వ తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్‌ డ్రిల్‌ నిర్వహించనుంది. గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో 1,590 తాజా కొవిడ్‌-19 కేసులు నమోదు అయ్యాయి. గత 146 రోజుల తర్వాత ఇదే హయ్యెస్ట్‌ కేసుల సంఖ్య కావడం గమనార్హం. ఒమిక్రాన్‌ సబ్‌వేరియెంట్‌ ఎక్స్‌బీబీ.1.16 విజృంభణ వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్రం చెబుతోంది. అలాగే.. ఆరు కరోనా మరణాలు సంభవించాయని గణాంకాల్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. 

మరిన్ని వార్తలు