30న చర్చలకు రండి

29 Dec, 2020 05:55 IST|Sakshi
ఢిల్లీ సమీపంలోని టిక్రీ సరిహద్దు వద్ద మహిళా రైతుల ఆందోళన

40 రైతు యూనియన్లకు కేంద్రం ఆహ్వానం

ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందన్న సంఘాలు

విద్యుత్‌ చట్టానికి వ్యతిరేకంగా జనవరి 6,7 తేదీల్లో నిరసనలు

సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది..ఈ నెల 30న చర్చలకు రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానం పంపితే, తమ ఎజెండాను అంగీకరించకుండా కేంద్రం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి విమర్శించింది. అయితే ప్రభుత్వ ఆహ్వానాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని సంఘాలు తెలిపాయి. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 34వ రోజుకు చేరుకుంది. ప్రతిష్టంభన తొలగించేందుకు ఈనెల 30న చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చేస్తున్న 40 రైతు సంఘాలను ఆహ్వానించింది. సాగు చట్టాలకు సంబంధించిన అన్ని అంశాలు చర్చించి ఒక సరైన పరిష్కారం కనుగొనేందుకు చర్చిద్దామని తెలిపింది.

వ్యవసాయ చట్టాలపై ఈనెల 29న చర్చిద్దామన్న రైతు సంఘాల ప్రతిపాదనకు ప్రభుత్వం బదులిస్తూ ఈ నెల 30న చర్చలకు సరేనంది. ఈ మేరకు బుధవారం విజ్ఞాన భవన్‌లో మధ్యాహ్నం 2గంటలకు చర్చలకు రావాలని రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌ లేఖ రాశారు. ఇప్పటివరకు ఇరు పక్షాల మధ్య ఐదు మార్లు చర్చలు జరిగాయి. ఇరు పక్షాల మధ్య ఈ నెల 5న జరిగిన చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. తిరిగి డిసెంబర్‌9న చర్చలు జరగాల్సిఉండగా వాయిదా పడ్డాయి. ఆ సమయంలో హోంమంత్రి అమిత్‌షాతో జరిపిన చర్చలు ఫలితాన్నివ్వలేదు. కానీ చర్చల అనంతరం చట్టాలకు 7–8 సవరణలు చేయడంతో పాటు, ఎంఎస్‌పీపై రాతపూర్వక హామీ ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 29న చర్చించేందుకు తయారని రైతు సంఘాలు కేంద్రానికి వెల్లడించాయి.  

మేం రెడీ, కానీ..
ఈనెల 30న చర్చలకు రావాలన్న కేంద్ర ప్రతిపాదనపై రైతు సంఘాలు సూత్రప్రాయ ఆమోదం తెలిపాయి. కానీ ముందుగా కేంద్రం చర్చల ఎజెండాను ప్రకటించాలని కోరాయి.  తాము ప్రతిపాదించిన పూర్తి ఎజెండాకు అంగీకరించట్లేదని, సమస్యలను పరిష్కరించేందుకు ఏమాత్రం ఇష్టపడట్లేదనేది అర్థమౌతోందని  అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి విమర్శించింది. మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేయడం, ఎంఎస్‌పీకి గ్యారెంటీ ఇవ్వడం అనే అంశాలను ఎజెండాలో ఉంచాలనేది తమ డిమాండని, కానీ ప్రభుత్వం తాజా లేఖలో ఇవేమీ ప్రస్తావించలేదని రైతు సంఘ నాయకుడు అభిమన్యు కోహార్‌ చెప్పారు.   
వచ్చే నెల్లో నిరసనలు  
వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్‌ చట్టంపై ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న పోరాటాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా బలోపేతం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నిర్ణయించింది. ఈమేరకు జనవరి 6, 7 తేదీల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి ఏఐఏడబ్ల్యూయూ పిలుపునిచ్చింది. జిల్లా స్థాయిలో వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్‌ తెలిపారు.

1500 సెల్‌ టవర్లు ధ్వంసం
పంజాబ్‌లో దాదాపు 1500కు పైగా సెల్‌ టవర్లను రైతులు ధ్వంసం చేసినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. దీంతో పలు చోట్ల సెల్‌ సేవలకు అంతరాయం కలిగినట్లు తెలిసింది. టవర్‌కు పవర్‌ సప్లై ఆపడం, కేబుల్స్‌ కట్‌ చేయడం వంటి చర్యలతో 1411 టవర్లు డ్యామేజీ అయ్యాయని, వాటి సంఖ్య ప్రస్తుతం 1500 దాటి ఉంటుందని సదరు వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా అంబానీ, ఆదానీలకు కొత్త సాగు చట్టాలు మేలు చేస్తాయన్న పుకార్లతో రైతులు విధ్వంసానికి దిగినట్లు చెప్పారు.

మా ఎజెండా ఇదే..
సాగు చట్టాల రద్దు, ఎంఎస్‌పీకి లీగల్‌ గ్యారెంటీ, ఢిల్లీలో వాయుకాలుష్య నివారణ ఆర్డినెన్సుకు సవరణలు, విద్యుత్‌ బిల్లుకు కీలక సవరణలు చేయడమనేవి తమ ఎజెండాలో ముఖ్యమైన అంశాలని రైతు సంఘాలు తెలిపాయి. ప్రభుత్వం మాత్రం అస్పష్టమైన విధానంతో చర్చలకు ఆహ్వానిస్తోందని విమర్శించాయి. కాగా మూడు సాగు చట్టాలు, ఎంఎస్‌పీ, విద్యుత్‌ బిల్లు, ఢిల్లీలో వాయుకాలుష్య నివారణ ఆర్డినెన్సుపై కూలంకషంగా చర్చిస్తామని వ్యవసాయ కార్యదర్శి సంజయ్‌ చెప్పారు. అయితే రైతు సంఘాలు కోరినట్లు స్పష్టమైన వాగ్దానాలేవీ కేంద్రం చేయలేదు. మరోవైపు నెలపైగా ఆందోళన చేస్తున్న రైతుల్లో కొందరు సొంతవూర్లకు వెళ్లి కుటుంబాలతో కలిసి తిరిగి వస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు