కోవిడ్‌ భయాలు.. పండుగ వేళ జాగ్రత్త.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

24 Dec, 2022 05:34 IST|Sakshi

న్యూఢిల్లీ: క్రిస్మస్, న్యూ ఇయర్‌ , సంక్రాంతి పండుగల వేళ కోవిడ్‌–19 నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని కేంద్రం సూచించింది. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, సమూహాలకు దూరంగా ఉండాలని, నాలుగ్గోడల మధ్య వేడుకలు నిర్వహించేటప్పుడు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.

జిల్లా స్థాయిలో వస్తున్న ఫీవర్‌ కేసుల్ని కూడా పర్యవేక్షించాలని, శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు , జలుబు , జ్వరంతో ఎవరు వచ్చినా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ నమూనాలను జినోమ్‌ సీక్వెన్సింగ్‌ జరపాలని సూచించారు. మరోవైపు శనివారం నుంచి విదేశాల నుంచి వచ్చే  ప్రయాణికుల్లో 2 శాతం మందికి కరోనా పరీక్షలకు సన్నాహాలు పూర్తిచేశారు. ఎంపిక చేసిన ప్రయాణికులు, కరోనా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించాలని విమానాశ్రయాల్లో సిబ్బందికి కేంద్ర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు