నో మోర్‌ ‘సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌’!

14 Aug, 2021 03:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 2022 నాటికి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ  ఈనెల 12న  ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ సవరణ నియమాలు–2021ను ప్రకటించింది.  ఇందులో భాగంగా అధిక చెత్తకు కారణమయ్యే  ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వస్తువులను వచ్చే ఏడాది జూలై నుంచి నిషేధించింది.  

‘ప్లాస్టిక్‌ ఇయర్‌బడ్స్‌’పై నిషేధం:
వచ్చే ఏడాది జూలై 1వ తేదీ నుంచి దేశంలో గుర్తించిన కొన్ని సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ప్లాస్టిక్‌ స్టిక్స్‌తో చేసిన ఇయర్‌ బడ్స్, బెలూన్లకు ప్లాస్టిక్‌ స్టిక్స్, ప్లాస్టిక్‌ జెండాలు, క్యాండీస్‌కు వాడే ప్లాస్టిక్‌ స్టిక్స్, ఐస్‌ క్రీమ్‌ స్టిక్స్, డెకరేషన్‌కు వాడే థర్మోకోల్‌ వస్తువులపై నిషేధం అమలులోకి రానుంది. వీటితోపాటు ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, స్వీట్‌ బాక్సులకు వాడే ప్యాకింగ్‌ పేపర్, ఇన్విటేషన్‌ కార్డులు, సిగరెట్‌ ప్యాకెట్లు, 100 మైక్రాన్లకు తక్కువగా ఉండే ప్లాస్టిక్‌ లేదా పీవీసీ బ్యానర్లను నిషేధిత జాబితాలో చేర్చింది.

120 మైక్రాన్లకు పెంపు
ఈ ఏడాది సెప్టెంబర్‌ 30వ తేదీ నుంచి దేశంలో ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌ల మందాన్ని 50 నుంచి 75 మైక్రాన్‌లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022 డిసెంబర్‌ 31 నుంచి ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌ల కనీస మందం 120 మైక్రాన్లకు పెంచింది. ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల మందం పెరిగిన కారణంగా వాటిని తిరిగి ఉపయోగించేందుకు అనుమతించనుంది. రాష్ట్రాలు చీఫ్‌ సెక్రటరీ స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని కోరింది.

మరిన్ని వార్తలు