హేతుబద్ధంగా వనరుల వినియోగం

27 Jun, 2021 03:41 IST|Sakshi

పరిహారం ఇవ్వకపోవడానికి ఆర్థిక భారం కారణం కాదు

‘కరోనా నష్టపరిహారం’లో సుప్రీంకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్‌

న్యూఢిల్లీ: దేశ వనరులను హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా ఉపయోగించాలన్నదే తమ ఉద్దేశమని, అందుకే కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వలేకపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇందులో ఆర్థిక భారం ప్రసక్తే లేదని, అది కారణం కాదని పేర్కొంది. కరోనా బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై న్యాయస్థానం తన తీర్పును జూన్‌ 21న రిజర్వ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం 39 పేజీల అదనపు అఫిడవిట్‌ దాఖలు చేసింది.

కరోనా వైరస్‌ మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోందని, ఇది జీవిత కాలంలో ఒకసారి ఎదురయ్యే విపత్తు అని పేర్కొంది. ఈ పరిణామాన్ని ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు గుర్తుచేసింది. నిపుణుల సూచన ప్రకారం నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(ఎన్‌డీఆర్‌ఎఫ్‌), స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌(ఎస్‌డీఆర్‌ఎఫ్‌)తోపాటు సంచిత నిధి నుంచి సైతం నిధులు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది. 2015 నుంచి 2020 వరకూ అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. జాతీయ స్థాయిలో గుర్తించిన 12 రకాల విపత్తులకే ఆర్థిక సాయం అందించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ జాబితాలో ‘కరోనా వ్యాప్తి’ లేదని వివరించింది. అయినప్పటికీ సహజ విపత్తుల వల్ల నష్టపోయిన వారికోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి 10 శాతం నిధులు ఖర్చు చేయవచ్చని వెసులుబాటు కల్పించినట్లు గుర్తుచేసింది.

జులై చివరికల్లా 51.6 కోట్ల డోసులు
జులై చివరికల్లా రాష్ట్రాలకు 51.6 కోట్ల డోసులు అందిస్తామని, అందులో ఇప్పటికే 35.6 కోట్ల డోసులు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా పిల్లలకు వ్యాక్సిన్‌పై కోర్టుకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న జైడస్‌ క్యాడిలా 12–18 ఏళ్ల లోపు వారిపై ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తిచేసిందని, కోవాగ్జిన్‌కు 2–18 ఏళ్లలోపు పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి డీసీజీఐ అనుమతి ఇచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. చట్టబద్ధమైన అనుమతులు లభిస్తే సమీప భవిష్యత్తులో పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో వస్తాయని కోర్టుకు తెలిపింది. భవిష్యత్తులో మరోవేవ్‌ వస్తే ఎదుర్కొనేలా రాష్ట్రాలను నిరంతరం సిద్ధం చేస్తున్నామని, మౌలిక సదుపాయాలను పెంచుతున్నామని పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా మరోవేవ్‌ వచ్చే అవకాశాలు.. వైరస్‌ మ్యుటేషన్లు, ప్రజలు తగిన కోవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటించడంపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది.

► దేశంలో 18 ఏళ్లు దాటినవారు పేదలైనా, ధనవంతులైనా కరోనా టీకా ఉచితంగా పొందడానికి సరిసమానంగా అర్హులేనని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అర్హులందరికీ సురక్షితమైన, ప్రభావవంతమైన టీకాను సాధ్యమైనంత త్వరగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది.

► కరోనా టీకా కోసం కోవిన్‌ పోర్టల్‌లో ముందే అపాయింట్‌మెంట్‌ పొందడం, ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, సెల్ఫ్‌–రిజిస్ట్రేషన్‌ తప్పనిసరేమీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. నేరుగా వ్యాక్సినేషన్‌ కేంద్రంలోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకొని, టీకా పొందవచ్చని సూచించింది.

మరిన్ని వార్తలు