కశ్మీర్‌: తక్షణమే 10 వేల బలగాల ఉపసంహరణ

19 Aug, 2020 21:27 IST|Sakshi

జమ్మూ కశ్మీర్‌ నుంచి పారా మిలిటరీ బలగాల ఉపసంహరణ

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ విషయంలో కేంద్రం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ మోహరించిన 10 వేల పారా మిలిటరీ బలగాలను తక్షణమే వెనక్కి రప్పించాలని నిర్ణయించింది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో సాయుధ బలగాల మోహరింపు అంశంపై హోం మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించిన అనంతరం కేంద్రం ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేసింది.‘‘జమ్మూ కశ్మీర్‌లో మెహరించిన 100 కంపెనీల బలగాలు తక్షణమే ఉపసంహరించుకునేందుకు నిర్ణయం తీసుకోబడింది. సదరు సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. (చదవండి: కొత్త ప్రపంచం.. సరికొత్త జీవితం: షా ఫైజల్‌)

కాగా ఈ 100 కంపెనీల బలగాలలో 40 సీఆర్‌పీఎఫ్ బలగాలు ఉండగా..‌ 20 కంపెనీల చొప్పున సీఐఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ బలగాలు ఉన్నాయి. ఇక గతేడాది ఆగష్టులో జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా భారీ సంఖ్యలో పారా మిలిటరీ బలగాలను మోహరించింది. అయితే గత కొన్ని నెలలుగా అక్కడ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న హోం మంత్రిత్వ శాఖ క్రమక్రమంగా బలగాలను ఉపసంహరించుకుంటోంది. ఇందులో భాగంగా మే నెలలో 10 సీఏపీఎఫ్‌ కంపెనీ(ఒక్కో కంపెనీలో దాదాపు 100 మంది)ల బలగాలను వెనక్కి రప్పించింది. ప్రస్తుతం అక్కడ 60 బెటాలియన్ల(ఒక్కో బెటాలియన్‌లో వెయ్యి మంది) సీఆర్‌ఎఫ్‌ బలగాలతో పాటు పారా మిలిటరీ బలగాలు ఉన్నట్లు సమాచారం.(ముర్ము రాజీనామాకు దారి తీసిన పరిస్థితులేమిటి?)

మరిన్ని వార్తలు