ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేస్తాం

18 Nov, 2021 04:36 IST|Sakshi

సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌  

నిత్యావసర సరుకు రవాణా వాహనాలకే అనుమతి

విద్యా సంస్థల మూసివేత

5 థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలోనే ఉత్పత్తి 

అధికారుల్లో ఉదాసీనత పెరిగిందని న్యాయస్థానం ఆక్షేపణ

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండడం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలకమైన చర్యలు చేపట్టబోతున్నట్లు బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. నగరంలోకి నిత్యావసర సరుకు రవాణాల వాహనాలు తప్ప ఇతర భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించనున్నట్లు తెలిపింది.

విద్యా సంస్థలను మూసివేయడంతోపాటు కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేయనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 11 థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో కేవలం ఐదు ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతిస్తామని, మిగిలినవి ఈ నెలాఖరు వరకూ మూసివేయనున్నట్లు పేర్కొంది. ఎన్‌టీపీసీ ఝాజ్జర్, మహాత్మాగాంధీ టీపీఎస్, సీఎల్‌పీ ఝాజ్జర్, పానిపట్‌ టీపీఎస్, హెచ్‌పీజీఎల్‌సీ, నభాపవర్‌ లిమిటెడ్‌ టీపీఎస్‌ రాజ్‌పురా, తల్వాండి సాబో టీపీఎస్‌ మాన్సాలను అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఒక అఫిడవిట్‌ను సమర్పించారు. ఈ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించడానికి వీలుగా పరిసర రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తొలగించడానికి రైతులకు ఉచితంగా యంత్రాలను అందజేయాలని కోరుతూ పర్యావరణ కార్యకర్త ఆదిత్య దూబే, న్యాయ విద్యార్థి అమన్‌ బాంకా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ‘గాలి నాణ్యత నిర్వహణ కమిషన్‌’ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని ఢిల్లీతోపాటు పరిసర రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.  సుప్రీంకోర్టు నవంబర్‌ 15న ఇచ్చిన ఆదేశాల ప్రకారం నవంబర్‌ 16న గాలి నాణ్యత నిర్వహణ కమిషన్‌ అత్యవసర సమావేశం ఏర్పాట చేసినట్లు కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది.

నిర్వహణ కమిషన్‌ నిర్ణయాలు/ఆదేశాలు  
► ఢిల్లీ, పరిసర రాష్ట్రాలు గ్యాస్‌తో అనుసంధానమైన పరిశ్రమలను గ్యాస్‌తోనే నడిపేలా చూడాలి. అనుమతి లేని ఇంధనాలతో నడిచే పరిశ్రమలను వెంటనే మూసివేయాలి.
► నిత్యావసర సరకులను తరలించే ట్రక్కులు మినహా మిగతా ట్రక్కులకు ఈ నెల 21 వరకు ఢిల్లీలోకి ప్రవేశం నిషేధించాలి. పదేళ్లు దాటిన డీజిల్‌ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్‌ వాహనాలు రహదారులపై తిరగకుండా చూడాలి. ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని సీఎన్‌జీ బస్సులను అందుబాటులో తీసుకురావాలి.
► నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను నిలిపివేయాలి, స్మాగ్‌ టవర్లు ఉపయోగించాలి. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో (హాట్‌స్పాట్లు) రోజుకి కనీసం మూడుసార్లు స్ప్రింకర్లు, డస్ట్‌ సప్రెసెంట్‌లు ఉపయోగించాలి.
► అత్యసవర సేవలకు మినహా డీజిల్‌ జనరేటర్లు వినియోగాన్ని కచ్చితంగా నిషేధించాలి.
► దేశ రాజధాని ప్రాంత రాష్ట్రాలు నవంబరు 21 వరకూ కనీసం 50 శాతం ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలి. ప్రైవేట్‌ సంస్థలను ఆ దిశగా ప్రోత్సహించాలి.
► తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలను మూసివేయాలి. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలి.

నిర్ణయాలన్నీ కోర్టులే తీసుకోవాలా?: సుప్రీం
ఢిల్లీలో కాలుష్యానికి కారణం పంట వ్యర్థాల దహనమేనని అనడం సమంజసం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కొందరు వ్యక్తులు స్టార్‌ హోటళ్లలో కూర్చొని, నాలుగైదు శాతం కాలుష్యానికి కారణమయ్యే రైతులపై నిందలు వేస్తున్నారని ఆక్షేపించింది. పంట వ్యర్థాల దహనం కారణంగా రైతులపై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. ‘వారం రోజులపాటు పంట వ్యర్థాలు దహనం చేయొద్దని రైతుల్ని కోరాలని ఇప్పటికే కేంద్రానికి సూచించాం. టీవీల్లో చర్చా కార్యక్రమాల్లో ఎవరి అజెండా ప్రకారం వారు మాట్లాడుతున్నారు.

ఇదే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తోంది’ అని కోర్టు పేర్కొంది. నిర్మాణాలు, పరిశ్రమల కార్యకలాపాలు ఏడాది పొడవునా సాగుతూనే ఉంటాయని, వాటిపై చర్యలు తీసుకోకుండా పంట వ్యర్థాల దహనం గురించే ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీసింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఒక రకమైన ఉదాసీనత పెరిగిందని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు కోరుకోవడం లేదని తప్పుపట్టారు. అన్ని నిర్ణయాలు కోర్టులే తీసుకోవాలని వారు ఆశిస్తున్నారని వ్యాఖ్యానించారు.

నిష్క్రియాపరత్వం ఎందుకని ప్రశ్నించారు. పిటిషనర్‌ తరపున అడ్వొకేట్‌ వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. వాయు కాలుష్యంపై అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారే గానీ ఏదీ జరగడం లేదని తెలిపారు. పంట వ్యర్థాల దహనాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలని కోరారు. పంట వ్యర్థాల దహనం 36 శాతం కాలుష్యానికి కారణమవుతున్నట్లు ‘సఫర్‌’ అధ్యయనం చెబుతోందని ఢిల్లీ ప్రభుత్వం తరఫు లాయర్‌ అభిషేక్‌ మనుసింఘ్వీ పేర్కొన్నారు. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్‌ సూచనలను పాటించాలని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.  

ఏడాదికి రూ.లక్ష కోట్ల నష్టం
కరోనా ధాటికి ఢిల్లీ విలవిలలాడిపోయింది. కోవిడ్‌తో గత 18 నెలల్లో 25 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఏడాదిన్నరలో ఎన్నోసార్లు కఠినమైన లాక్‌డౌన్‌లు విధించి కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ కరోనా కంటే ప్రతీ ఏడాది కాలుష్యం అనే భూతం ఢిల్లీని భయపెడుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టైనా ఎందుకు లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  కాలుష్యం కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత ఏడాది ఢిల్లీలో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

బుధవారం ఢిల్లీలో కాలుష్యంతో నిండిన ఒక రహదారి

కరోనా తరహాలో కాలుష్యం ఆరోగ్యంతో పాటు ఆర్థిక రంగాన్ని కుదేలు చేస్తోంది. ప్రతీ ఏడాది దేశ రాజధానికి లక్ష కోట్ల రూపాయల నష్టం వస్తోంది. అయినప్పటికీ కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప ప్రభుత్వాల్లో కదలిక రావడం లేదు. ప్రఖ్యాత లాన్సెట్‌ మ్యాగజైన్‌ ప్రకారం 2019లో భారత్‌లో కాలుష్యం బారిన పడి 16.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు ఏడాది శిలాజ ఇంధనాల కాలుష్యంతో దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని హార్వార్డ్‌ అధ్యయనం తేటతెల్లం చేస్తోంది.

కాలుష్య నష్టాన్ని ఎలా లెక్కిస్తారు ?  
కాలుష్యం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని రెండు పద్ధతుల్లో లెక్కిస్తారు. ఉత్పత్తి సామర్థ్యమున్న ప్రజలు ముందుగానే మరణించడం, కాలుష్యంతో అనారోగ్యం పాలైన వారికి చికిత్స చెయ్యడానికైన ఖర్చు, పని చేసే ప్రాంతాల్లో దగ్గు, జలుబుతో బాధపడడం వల్ల పడిపోయిన ఉత్పాదకత వంటి వాటినన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కాలుష్యంతో ఏర్పడిన నష్టాన్ని లెక్కిస్తారు. ఆ విధంగా చూసుకుంటే కాలుష్యంతో దేశ జీడీపీలో 4.5 శాతం నష్టం ప్రతీ ఏడాది వాటిల్లుతోంది.  గ్రీన్‌పీస్‌ సంస్థ వేసిన అంచనాల ప్రకారం గత ఏడాది కాలుష్యంతో ఢిల్లీ రాష్ట్ర జీడీపీలో 13 శాతం అంటే దాదాపు రూ.60 వేల కోట్ల నష్టం వాటిల్లింది.  విల్లింగ్‌ టు పే (డబ్ల్యూటీపీ) అనే విధానంలోనూ కాలుష్య నష్టాన్ని లెక్కిస్తారు. దీని ప్రకారం కాలుష్య నివారణకు ప్రజలు ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్న లెక్కల ఆధారంగా చూస్తే ఢిల్లీకి ఏడాదికి  లక్ష కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లుతోంది. కాలుష్య సమస్య నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేవీ శాశ్వత చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.      

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు