Prashant Bhushan: వ్యాక్సిన్‌ వ్యతిరేక ట్వీట్లు.. షాకిచ్చిన ట్విటర్‌

29 Jun, 2021 07:52 IST|Sakshi

వ్యాక్సిన్‌లను పరీక్షించకుండానే  జనాలపై ప్రయోగిస్తున్నారని, యువతపై ప్రతికూల ప్రభావం పడుతోందని, మరణాలు సంభవిస్తున్నాయని న్యాయకోవిదుడు ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన ట్వీట్లు తీవ్రదుమారాన్ని రేపాయి. అంతేకాదు వ్యాక్సిన్‌ పనితీరుపై తనకు అనుమానాలు ఉన్నాయని, పొరపాటున కూడా వ్యాక్సిన్‌ తీసుకోబోనని ఆయన కామెంట్లు కూడా చేశాడు. ఈ నేపథ్యంలో కేంద్రం, ట్విటర్‌ రెండూ.. ఆయనకు ధీటుగానే బదులిచ్చాయి. 

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌లపై సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన ట్వీట్లు విమర్శలకు దారితీశాయి. కరోనా వ్యాక్సిన్‌ల పనితీరును పరిశీలించకుండానే నేరుగా ప్రజలకు వేస్తున్నారని, దీనివల్ల యువత ప్రమాదం బారినపడుతోందని ఆయన కామెంట్లు చేశాడు. దీనిపై సెంటర్‌ కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా తీవ్రంగా స్పందించాడు. కరోనా వ్యాక్సిన్‌ల భద్రతను, సమర్థతను తప్పుబట్టడం సరికాదని అరోరా వ్యాఖ్యానించాడు. ‘‘వ్యాక్సిన్‌ వికటించిన తొలి మరణం వివరాలను కూడా మేం ప్రజలకు అందుబాటులో ఉంచాం. అంతేకాదు డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం.. వ్యాక్సిన్‌ వికటించిన ఘటనలపై దర్యాప్తు కూడా జరిపిస్తున్నాం. ప్రజల్లో జ్వరాలు, నొప్పులు తప్పించి ప్రతికూల ప్రభావం చూపించిన కేసులు, సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఐసీయూలో, చావు అంచున ఉన్నవాళ్లపై కూడా వ్యాక్సిన్‌లు సానుకూల ప్రభావం చూపిస్తున్నాయి కదా. ఈ విషయాలేవీ ఆయనకు కనబడడం లేదా? ఎందుకు గుర్తించడం లేదు? అని అరోరా బదులిచ్చాడు. 

షాకిచ్చిన ట్విట్టర్‌
ఇక తప్పుడు సమాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్విటర్‌.. ప్రశాంత్‌ భూషణ్‌ వ్యవహారంలో త్వరితగతిన స్పందించింది. ఆయన ట్వీట్లు తప్పుడు దారి పట్టించేవిగా ఉన్నాయని నోటిఫికేషన్‌ ఇచ్చింది. అంతేకాదు వ్యాక్సిన్‌ భద్రతపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నాయో చూడండని సూచించాయి. ఈ మేరకు త్వరలోనే ఆయన ట్వీట్లను ట్విటర్‌ తొలగించే ఆస్కారం కూడా లేకపోలేదు.

పేపర్‌ కట్టింగ్‌తో మొదలు.. 
పదిరోజుల వ్యాక్సిన్‌ తీసుకున్న 45ఏళ్ల మహిళ మరణించడం.. ఆమె మృతికి వ్యాక్సిన్‌ కారణమని ఆమె భర్త ఆరోపించడం నేపథ్యంగా ఓ పేపర్‌లో కథనం పబ్లిష్‌ అయ్యింది. ఆ కట్టింగ్‌ను, వ్యాక్సిన్‌ పనితీరు వ్యర్థం అనే ఓ వెబ్‌ ఆర్టికల్‌ను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ప్రశాంత్‌ భూషణ్‌.. యువత మీద, కరోనా నుంచి కోలుకున్న వాళ్ల మీద పరీక్షించకుండానే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చారంటూ విమర్శలకు దిగారు. కరోనాతో చనిపోయే అవకాశాలు మాత్రమే యువతకు ఉండేవని, కానీ, వ్యాక్సిన్‌తో ఆ అవకాశాలు మరింత ఎక్కువయ్యాయని తీవ్ర కామెంట్లతో మరో ట్వీట్‌ చేశాడు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు సహజంగా ఇమ్యూనిటీని సంపాదించుకుంటున్నారని, అలాంటి వాళ్ల ఇమ్యూనిటీని కూడా వ్యాక్సిన్‌ దెబ్బతీస్తోందని కామెంట్లు చేశాడు.

చదవండి: రూపాయి జరిమానా.. సరిపోతుందా?

మరిన్ని వార్తలు