న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్డౌన్, కంటైన్మెంట్ జోన్లను అమలు చేయడంపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా పాజిటివిటీ రేటు వారానికి 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఆసుపత్రుల్లో పడకలు 60 శాతానికి పైగా భర్తీ అయినప్పుడు ఈ పరిమితులను విధించాలని స్పష్టం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొన్న నిబంధనల ప్రకారం జిల్లా, నగర ప్రాంతాల్లో కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను ఇంటెన్సివ్, లోకల్, ఫోకస్డ్ కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది.
లాక్ డౌన్ అనేది ఎప్పుడు, ఎక్కడ పెట్టాలన్న విషయాన్ని కరోనాతో ప్రభావితమైన జనాభా, భౌగోళిక వ్యాప్తి, ఆ ప్రదేశంలో ఉండే ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, మానవశక్తి , ఇతర వనరులను దృష్టిలో ఉంచుకొని, విశ్లేషణలను ఆధారంగా చేసుకోవాలని సూచించింది. ఈ ప్రాంతాలను "పెద్ద కంటైన్మెంట్ జోన్" పిలువవచ్చునని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రాలు లాక్డౌన్ను విధించడంపై విస్తృత మార్గదర్శకాలను ఇచ్చామని గుర్తుచేసింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కనీసం 14 రోజులపాటు ఆంక్షలు అమలు చేయాలని తెలిపింది.
కంటైన్మెంట్ జోన్లను గుర్తించిన తర్వాత కరోనా నియంత్రణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీచేసిన సూచనలు:
కరోనా తీవ్రతను జాగ్రత్తగా విశ్లేషించి రాష్ట్రాలే స్వంతంగా నిర్ణయించుకోవాలని కేంద్రం చెబుతోంది. కోవిడ్-19కు అంకితమైన ఆసుపత్రులకు సీనియర్ జిల్లా అధికారులను నియమించాలని, రోగులను సజావుగా మార్చడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలను ఇచ్చింది.