అంతర్‌రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు వద్దు: కేంద్రం

22 Aug, 2020 18:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు హోం మంత్రిత్వ శాఖ లేఖ

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అన్‌లాక్‌-3 ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అంతర్‌రాష్ట్ర, రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు ప్రజల రాకపోకలు, వస్తువుల రవాణాపై ఇంకా నిషేధం కొనసాగించడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి చర్యల వల్ల ఆర్థిక కార్యకలాపాలకు భంగం కలగడంతో పాటుగా ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. అంతర్‌రాష్ట్ర, రాష్ట్రాల మధ్య రాకపోకలు కొనసాగించవచ్చని ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిందని, అయినప్పటికీ ఆంక్షలు విధిస్తే దీనిని ఉల్లంఘన చర్యగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించింది.  (అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల)

ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా శనివారం కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. నిబంధనలు ఎత్తివేయాలంటూ విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ- పర్మిట్ల పేరిట సరుకు రవాణాకు ఆటంకం కలిగించవద్దని కోరారు. ఒకవేళ ఇలాంటి ఆంక్షల గురించి మరోసారి తమ దృష్టికి వస్తే విపత్తు నిర్వహణ చట్టం-2005లోని నిబంధనల ప్రకారం ఉల్లంఘన చర్యగా పరగణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి నేపథ్యంలో మార్చి 24 అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. (అన్‌లాక్ 4.0: తెరుచుకోనున్న సినిమాహాళ్లు!)

ఈ క్రమంలో పలు దఫాలుగా నిబంధనలు సడలించిన కేంద్ర ప్రభుత్వం మే రెండోవారంలో అన్‌లాక్‌ ప్రక్రియను ప్రారంభించింది. అయితే అన్‌లాక్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు గతంలో ప్రకటించిన హోం మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఈ మేరకు లేఖ రాయడం గమనార్హం. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న అన్‌లాక్‌-3 ఆగష్టు 31తో ముగియనున్న తరుణంలో ఇన్నాళ్లుగా మూతపడ్డ థియేటర్లు, మార్కెట్లను కనీస జాగ్రత్తలు పాటిస్తూ తెరిచేందుకు కేంద్రం అనుమతించినున్నట్లు తెలుస్తోంది. ఇక దేశంలో గడచిన 24 గంటల్లో 69,878 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో కోవిడ్‌ బాధితుల సంఖ్య 29,75,702 కు చేరుకుంది. మొత్తంగా 55,794 కరోనాతో మరణించారు. ఇక దేశంలో ప్రస్తుతం 6,97,330 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత దృష్ట్యా ఇప్పటికీ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో అజయ్‌ భల్లా ఈ మేరకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు