‘మన చట్టాలు, న్యాయవ్యవస్థ, సమాజం వాటికి వ్యతిరేకం’

14 Sep, 2020 16:18 IST|Sakshi

ఢిల్లీ హైకోర్టులో వాదనలు

సాక్షి, న్యూఢిల్లీ : స్వలింగ జంటల మధ్య వివాహాన్ని మన చట్టాలు, న్యాయవ్యవస్థ, సమాజం, మన విలువలు గుర్తించలేదని, ఇలాంటి వివాహాలను అనుమతించలేమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం (హెచ్‌ఎంఏ), ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ ప్రతీక్‌ జలాన్‌ల ఎదుట సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రభుత్వ వాదనను వినిపించారు. స్వలింగ జంటల మధ్య వివాహాన్ని మన చట్టాలు, సమాజం, న్యాయవ్యవస్థ గుర్తించవని పేర్కొంటూ ఈ తరహా వివాహాలకు అనుమతిస్తూ పిటిషనర్‌ కోరిన ఊరటను కల్పించడాన్ని మెహతా వ్యతిరేకించారు.

ఈ తరహా వివాహాలను చట్టబద్ధం చేయాలని, ఊరట కల్పించాలని పిటిషనర్‌ కోరారని ఇందుకు అనుమతిస్తే ఇది పలు చట్ట నిబంధనలకు విరుద్ధమవుతుందని అన్నారు. హిందూ వివాహ చట్టంలో వివాహాల నియంత్రణ, వివాహేతర సంబంధాల నివారణకు పలు నిబంధనలు భార్య, భర్తల గురించి ప్రస్తావిస్తాయని స్వలింగ జంటల్లో ఈ పాత్రలను ఎలా చూస్తారని మెహతా ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా పద్ధతులు మారిపోతున్నాయని, అయితే అవి భారత్‌కు వర్తించవచ్చు..వర్తింపకపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. చదవండి : చ‌నిపోయేవ‌ర‌కు స్వ‌లింగ సంప‌ర్కులని తెలియ‌దు

ఈ కేసులో పిటిషన్‌ అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. ప్రభావితమయ్యే వారు బాగా చదువుకున్నవారని, వారు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది.  పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్క చర్యలను సుప్రీంకోర్టు నేరపూరిత స్వభావం నుంచి తొలగించినా స్వలింగ జంటల వివాహాలు ఇప్పటికీ సాధ్యం కావడం లేదని పిటిషన్‌ వాదించింది. ఇక స్వలింగ వివాహాన్ని రిజిస్టర్‌ చేసేందుకు నిరాకరణకు గురైన వ్యక్తుల వివరాలు ఇవ్వాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది అభిజిత్‌ అయ్యర్‌ మిత్రాను కోర్టు కోరింది. తదుపరి విచారణను అక్టోవర్‌ 21కి హైకోర్టు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు