ఏఎఫ్‌ఎస్‌పీఏ ఎత్తివేత పరిశీలనకు కమిటీ

27 Dec, 2021 06:27 IST|Sakshi

వివేక్‌ జోషి అధ్యక్షతన నియమించిన కేంద్రం

కోహిమా/గువాహటి: సాయుధ బలగాల(ప్రత్యేక అధికారాల)చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)–1958ను ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. రిజిస్ట్రార్‌ జనరల్, సెన్సస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా వివేక్‌ జోషి నేతృత్వంలోని ఈ కమిటీలో హోంశాఖ అదనపు కార్యదర్శి పీయూశ్‌ గోయల్‌ సభ్య కార్యదర్శిగా ఉంటారు. ఈ కమిటీ 45 రోజుల్లో తన నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఈ కమిటీలో నాగాలాండ్‌ చీఫ్‌ సెక్రటరీ, పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌తోపాటు అస్సాం రైఫిల్స్‌(నార్త్‌) ఇన్‌స్పెక్టర్‌ జనరల్, సీఆర్‌పీఎఫ్‌ నుంచి ఒక ప్రతినిధి ఉంటారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నాగాలాండ్‌కు కల్లోలిత ప్రాంతంగా గుర్తింపును కొనసాగించడం/ రాష్ట్రం నుంచి ఏఎఫ్‌ఎస్‌పీఏను ఉపసంహరించడంపై స్పష్టత వస్తుందన్నారు. ఇటీవల మోన్‌ జిల్లాలో భదత్రాబలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు మృతి చెందడంతో ఏఎఫ్‌ఎస్‌పీఏను ఉపసంహరించాలనే డిమాండ్‌ ఊపందుకుంది. కాల్పులకు బాధ్యులుగా అనుమానిస్తున్న వారిపై సస్పెన్షన్‌ వేటు పడిందన్నారు.

మరిన్ని వార్తలు