పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలే అమలుకాకుంటే ప్రజాస్వామ్యానికి విలువేది?

23 Jul, 2021 12:31 IST|Sakshi

ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించాలని వైఎస్సార్‌ సీపీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈరోజు(శుక్రవారం) మధ్యాహ్నం గం. 12.00ల వరకూ ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత వైఎస్సార్‌ సీపీ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో  మాట్లాడారు. దీనిలో భాగంగా వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ.. ‘పోలవరం సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించాలి.

పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. పోలవరం జాతీయ ప్రాజెక్టు అన్న విషయం కేంద్రం మరిచిపోతోంది. 55 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2వేల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది’అని పేర్కొన్నారు. 

లోక్‌సభ సభ్యురాలు వంగా గీత మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం నిర్లక్ష్యం వీడాలి. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్‌ను ఆమోదించారు. తిరుపతిలో స్వయంగా ప్రధానే ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలే అమలుకాకుంటే ప్రజాస్వామ్యానికి విలువేది?. పునరావాస ప్యాకేజీ ఎందుకు ఇవ్వడం లేదు?, గిరిజనులపై కేంద్రానికి ప్రేమ లేదా?’ అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు