బెంగాల్‌లో హింసకు ముందే ప్లాన్‌..!

30 Jun, 2021 01:59 IST|Sakshi

‘కాల్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థ’ నిజ నిర్ధారణ కమిటీ వెల్లడి 

సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసపై నిజ నిర్ధారణకు ‘కాల్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థ’ఏర్పాటు చేసిన కమిటీ తమ నివేదికను కేంద్ర హోం శాఖకు సమర్పించింది. ఎన్నికల తర్వాత జరిగిన హింస ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని నివేదికలో పేర్కొంది. అంతేగాక హింసాకాండను నివారించడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డిని కలిసిన 5 గురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ నివేదికను సమర్పించింది.  

సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రమోద్‌ కోహ్లీ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో కేరళ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌ బోస్, జార్ఖండ్‌ మాజీ డీజీపీ నిర్మల్‌ కౌర్, ఐసీఎస్‌ఐ మాజీ అధ్యక్షుడు నిసార్‌ అహ్మద్, కర్ణాటక ప్రభుత్వ మాజీ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎం.మదన్‌గోపాల్‌ సభ్య కార్యదర్శిగా ఉన్నారు. బెంగాల్‌లో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై నిజనిర్ధారణ చేసేందుకు ఈ కమిటీ సభ్యులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

అక్కడి నుంచి 200కి పైగా ఫోటోలు, 50కి పైగా వీడియోలను విశ్లేషించి 63 పేజీల నివేదికను సిద్ధం చేశారు.  పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కమిటీ గుర్తించింది. ఎన్నికల అనంతర హింస ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని పేర్కొంది. అమాయక ప్రజలపై నేరస్తులు, మాఫియా డాన్లు, క్రిమినల్‌ గ్యాంగ్స్‌ దాడి చేసి హింసకు పాల్పడ్డారని కమిటీ పేర్కొంది. ఈ నివేదికను త్వరలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు అందించనున్నట్లుహోంశాఖ సహాయమంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు