కోవిడ్‌ మృతులు..న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంపై కేం‍ద్రం ఆగ్రహం

27 May, 2021 21:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: భార‌త్ లో క‌రోనా మ‌ర‌ణాల‌పై అమెరిక‌న్ ప‌త్రిక న్యూయార్క్ టైమ్స్ వెలువరించిన క‌థ‌నాన్ని కేంద్ర ప్ర‌భుత్వం తోసిపుచ్చింది. ఈ క‌థ‌నంలో వెల్ల‌డించిన గ‌ణాంకాలు వ‌క్రీక‌రించిన అంచ‌నాల‌తో కూడిన‌వ‌ని నిరాధార, త‌ప్పుడు రాత‌ల‌ని కేంద్రం స్పష్టం చేసింది. భార‌త్ లో 3.15 ల‌క్ష‌ల క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని ప్ర‌భుత్వం చెబుతుండ‌గా వాస్త‌వంగా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి 16 ల‌క్ష‌ల వ‌ర‌కూ మ‌ర‌ణాలు సంభవించి ఉంటాయని న్యూయార్క్ టైమ్స్ వెబ్ సైట్లో మే 25న పేర్కొంది.

ఆస్పత్రులు రోగుల‌తో నిండిపోవ‌డం, ఇండ్ల‌లోనే ప‌లు క‌రోనా మ‌ర‌ణాలు చోటుచేసుకోవ‌డంతో మ‌ర‌ణాలు అధిక సంఖ్య‌లో ఉండే అవకాశం ఉంద‌ని న్యూయార్క్‌ టైమ్స్‌ అంచ‌నా వేసింది. సెకండ్‌ వేవ్‌ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్‌ మరణాలు భారీగా నమోదయ్యాయని.. వీటిని మ‌ర‌ణాల‌ను కూడా అధికారిక మ‌ర‌ణాల్లో క‌ల‌ప‌లేద‌ని రాసుకొచ్చింది. కాగా భార‌త్‌లో క‌రోనా మ‌ర‌ణాల‌పై న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నం నిరాధార‌మ‌ని, త‌ప్పుడు అంచ‌నాల‌తో కూడిన‌ద‌ని అధికార వ‌ర్గాలు తోసిపుచ్చాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా వ‌క్రీక‌రించిన అంచ‌నాల‌తో ఈ నివేదిక‌ను వండివార్చార‌ని స్ప‌ష్టం చేశాయి.

గత 20 రోజులుగా కొత్త కోవిడ్ కేసులలో క్రమంగా క్షీణత ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది, 24 రాష్ట్రాలు యాక్టీవ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. దేశంలో నేడు ఒక రోజులో 2.11 లక్షల కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా 3,847 మంది మరణించారు. మొత్తం కేసులు 2.73 కోట్లు, మరణాలు 3.15 లక్షలుకు చేరుకున్నాయి.

చదవండి: కరోనా మృతులకు న్యూయార్క్‌ టైమ్స్ నివాళి 

మరిన్ని వార్తలు