కులగణనలో ఓబీసీలను చేర్చొద్దు

24 Sep, 2021 04:44 IST|Sakshi

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: కులగణన–2021లో వెనకబడిన వర్గాలను చేర్చొద్దని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఓబీసీల వివరాల్లో కచి్చతత్వం లేదని తెలిపింది. 2021 కులగణనలో ఎస్సీ, ఎస్టీల లెక్కలను మాత్రమే సేకరించి, ఇతర కులాలను మినహాయించాలనేది ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయమని తెలిపింది. రాష్ట్రంలో ఓబీసీల కులగణన కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ పరిగణనలోకి తీసుకోవద్దంటూ కేంద్ర సామాజిక సాధికారత శాఖ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ మేరకు పేర్కొంది. జనవరి 7, 2020న జారీ చేసిన నోటిఫికేషన్‌లో 2021 కులగణనకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలను మాత్రమే చేర్చామని కేంద్రం తెలిపింది.

2021 కులగణనలో గ్రామీణ భారతంలోని వెనకబడిన వర్గాల సామాజిక–ఆర్థిక డాటాను పొందుపరచాలని సెన్సస్‌ విభాగానికి ఆదేశాలు ఇవ్వొద్దని, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 8లో పొందుపరిచిన విధాన నిర్ణయంలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందని పేర్కొంది. ఓబీసీల కులగణన చేపట్టడానికి రిజిస్ట్రార్‌ జనరల్, సెన్సస్‌ కమిషనర్‌కు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన ఆదేశాలు లేవని తెలిపింది. కులగణనకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులను హైకోర్టులు, సుప్రీంకోర్టు గతంలో కొట్టివేశాయని తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం వద్ద ఉన్న మహారాష్ట్రలోని ఓబీసీల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  

90 రోజుల పరిమితి అమల్లోకి..
పిటిషన్‌ దాఖలుపై సడలింపు తీసేయాలని సుప్రీంకోర్టు నిర్ణయం  
సాక్షి, న్యూఢిల్లీ: పిటిషన్లు దాఖలు చేయడానికి గతంలో ఇచ్చిన సడలింపు ఎత్తివేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అక్టోబరు 1 నుంచి పిటిషన్‌ దాఖలుకు 90 రోజుల కాలపరిమితి అమల్లోకి వస్తుందని తెలిపింది. కరోనా నేపథ్యంలో సుమోటోగా ఇచి్చన సడలింపులు నిలిపివేయాలని జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ సూర్యకాంత్‌ల బెంచ్‌ నిర్ణయించింది. తీర్పు రిజర్వు చేస్తున్నట్లు పేర్కొంది. మూడో వేవ్‌ పొంచి ఉందంటూ ఈ ఏడాది చివరి వరకూ సడలింపు ఇవ్వాలన్న వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు.

‘మీరు నిరాశపడకండి. మూడో వేవ్‌ను ఆహ్వానించకండి’’ అని న్యాయవాదులనుద్దేశించి జస్టిస్‌ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. హైకోర్టుల తీర్పులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడానికి 90 రోజుల కాల పరిమితి అమల్లోకి తీసుకురావాలంటూ ఈ ఏడాది మార్చి 8న అటార్నీ జనరల్‌ కోర్టును కోరిన విషయం విదితమే.  అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశి్చమబెంగాల్‌ ఎన్నికలకు సంబంధించి దాఖలు చేసే పిటిషన్లకు కాలపరిమితి విధించాలని ఎన్నికల కమిషన్‌ కోరింది. లేదంటే రాబోయే ఎన్నికలకు ఈవీఎం, వీవీప్యాట్‌లు తిరిగి ఉపయోగించలేని పరిస్థితి వస్తుందని పేర్కొంది.
 

మరిన్ని వార్తలు