మారటోరియం : భారీ ఊరట

3 Oct, 2020 12:53 IST|Sakshi

రెండు కోట్ల  రూపాయల లోపు  రుణాలపై వడ్డీ మాఫీ

సాక్షి, న్యూఢిల్లీ: ఆరు నెలల రుణ మారటోరియం కాలానికి వడ్డీని మాఫీ చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై 'వడ్డీపై వడ్డీని' మాఫీ చేస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. బ్యాంకులపై ప్రభావం చూపుతుందంటూ వడ్డీ మాఫీ చేయడానికి నిరాకరించిన కేంద్రం,  తాజా నిర్ణయంతో పలు రుణ గ్రహీతలకు భారీ ఊరట కల్పించనుంది. దీనిపై తదుపరి వాదనలు సోమవారం జరగనున్నాయి. 

ఆరు నెలల మారటోరియం కాలం (మార్చి1- ఆగస్టు 31)లో వడ్డీని వదులుకునే భారాన్ని ప్రభుత్వం భరించడమే ఏకైక పరిష్కారం అని కేంద్రం సుప్రీంకోర్టుకు శుక్రవారం సమర్పించిన అఫిడవిట్‌లో  పేర్కొంది. దీంతో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ)లతో పాటు, వ్యక్తిగత, విద్య, గృహ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటో మొదలైన చిన్నరుణగ్రహీతలకు ఈ మినహాయింపు భారీ ఉపశమనం లభించనుంది. తాత్కాలిక నిషేధాన్ని పొందారా అనే దానితో సంబంధం లేకుండా వడ్డీపై మాఫీ అమలు కానుంది. ఈ మేరకు, మాజీ కంట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి కమిటీ ఇచ్చిన సూచనలను కేంద్రం ఆమోదించింది.

దేశం ఎదుర్కొంటున్న సంక్షోభ స్థితిలో రుణగ్రహీతలకు సహాయం చేసేందుకు మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని వదులుకోవడం వల్ల కలిగే భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వడ్డీని మాఫీ చేస్తే బ్యాంకులపై 6 లక్షల కోట్ల భారం పడుతుందని పేర్కొంది. కాగా కరోనా మహమ్మారి సంక్షోభం, లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు నెలల తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అయితే వడ్డీ మీదవడ్డీ వసూళ్లపై సుప్రీం దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. ఆర్బీఐ వెనక దాక్కుంటారా, వ్యాపారమే ముఖ్యం కాదు, ప్రజలకు ఊరట కలిగించడం ప్రధానమే అంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు