సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులపై కేంద్రం మౌనం 

20 Sep, 2021 10:17 IST|Sakshi

68 పేర్లపై ఇంకా స్పందించని ప్రభుత్వం  

దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో 465 జడ్జీ పోస్టులు ఖాళీ 

న్యూఢిల్లీ: హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో జడ్జీల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం 68 మంది జ్యుడీషియల్‌ అధికారులు, న్యాయవాదుల పేర్లను సిఫారసు చేయగా, కేంద్రం ఇంకా స్పందించలేదని తెలిసింది. ఈ ఏడాది ఆగస్టు 8 నుంచి సెపె్టంబర్‌ 1 దాకా వివిధ హైకోర్టులు సిఫారసు చేసిన 100కు పైగా జ్యుడీషియల్‌ అధికారులు, అడ్వొకేట్ల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం పరిశీలించింది.

ఇందులో నుంచి 12 హైకోర్టుల్లో జడ్జీల నియామకం కోసం చివరకు 68 పేర్లను ఎంపిక చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసిన ఈ 68 పేర్లపై కేంద్రం ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ 68 పేర్లలో కర్ణాటక నుంచి ఇద్దరి పేర్లను, జమ్మూకశ్మీర్‌ నుంచి ఒకరి పేరును కొలీజియం మూడోసారి కేంద్రానికి పంపడం గమనార్హం. మరో 10 మంది పేర్లను రెండోసారి సిఫారసు చేసింది. 

సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమించాలంటూ ఆగస్టు 17న కొలీజియం ముగ్గురు మహిళలతో సహా మొత్తం 9 పేర్లను కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర సర్కారు వేగంగా నిర్ణయం తీసుకుంది. సానుకూలంగా స్పందించింది. సుప్రీం చరిత్రలోనే తొలిసారిగా ఒకేరోజు 9 మంది ఆగస్టు 31న సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేశారు. మొత్తం 25 హైకోర్టుల్లో మంజూరైన జడ్జీ పోస్టులు 1,098 కాగా. కేంద్ర న్యాయ శాఖ సమాచారం ప్రకారం.. సెపె్టంబర్‌ 1వ తేదీ నాటికి 465 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు