చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై స్పందించిన పోలీసులు.. వీడియో పంపింది అతనికే!

18 Sep, 2022 19:30 IST|Sakshi

చండీగఢ్‌: చండీగఢ్ యూనివర్సీలో అమ్మాయిల ప్రైవేటు వీడియోల లీక్ ఘటనపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఒక అమ్మాయి తన సొంత వీడియోను మాత్రమే బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని చెప్పారు. అతను హిమచాల్ ప్రదేశ్‌కు చెందినవాడని వెల్లడించారు. వీడియో పంపిన అమ్మాయిని అరెస్టు చేసి విచారించిన తర్వాతే ఈ విషయం తెలిసిందని చెప్పారు.

అయితే ఈ వ్యవహారంలో అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌ పాత్ర ఏమైనా ఉందా? అనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. అతడ్ని అరెస్టు చేసి విచారిస్తేనే అసలు నిజం బయటపడుతుందన్నారు. సొంత వీడియో లీక్ చేసుకున్న అమ్మాయి ఇతర అమ్మాయిల వీడియోలను కూడా రికార్డు చేసిందా? అనే విషయంపైనా విచారణ చేస్తామన్నారు. అలాగే యూనివర్సిటీలో ఇప్పటివరకు ఒక్క విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. అత్యంత సున్నితమైన ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిలు స్నానం చేస్తుండగా తీసిన వీడియోలు లీక్ అయ్యాయని ప్రచారం జరిగింది. దీనిపై విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి యూనివర్సిటీలో నిరసనలు చేపట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అయితే లీక్ అయింది ఒక్క అమ్మాయి వీడియోనే అని యూనివర్సిటీ అధికారులతో పాటు పోలీసులు స్పష్టతనిచ్చారు.

మరోవైపు ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. కాగా.. యూనివర్సిటీలో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 19,20)  క్లాసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది.
చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్‌..? స్పందించిన యూనివర్సిటీ

మరిన్ని వార్తలు