ఎన్నిరోజుల నుంచి రిమాండ్‌లో ఉన్నారు?: సీజేఐ చంద్రచూడ్‌

25 Sep, 2023 11:55 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇవాళ(సోమవారం) విచారణకు స్వీకరించలేదు.  అత్యవసరంగా చంద్రబాబు పిటిషన్‌ను విచారించాలని న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా మెన్షన్‌ చేయగా.. కుదరదని తేల్చేసింది సర్వోన్నత న్యాయస్థానం. అయితే.. పూర్తి వివరాలతో రేపు రావాలని.. రేపే(మంగళవారం) మెన్షన్‌ లిస్ట్‌లో చేరుస్తామని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయడంతో పాటు.. సీఐడీ రిమాండ్‌లపై ఏపీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ చంద్రబాబు నాయుడు పిటిషన్‌ వేశారు. సోమవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే.. హడావిడిగా చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ ముందు తీసుకెళ్లారు లూథ్రా.   అయితే సుప్రీం కోర్టులో ఇవాళ్టి మౌఖిక ప్రస్తావన విషయాల జాబితాలో(oral mentioning matters) ఈ పిటిషన్ లేదు. 

ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ జోక్యం చేసుకుని.. ‘‘ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు? అని ప్రశ్నించారు. దానికి లూథ్రా ‘ఈ నెల 8వ తేదీన’అని బదులిచ్చారు.  ఎన్నిరోజుల నుంచి రిమాండ్‌లో ఉన్నారని సీజేఐ ఆరా తీశారు.  కేసు వివరాలు చెప్పేందుకు ప్రయత్నించగా సీజేఐ ఆపి.. రేపే అన్ని విషయాలను రేపు మెన్షన్‌ చేయాలని లూథ్రాకు సూచించారు. 

దీంతో.. రేపు లిస్టింగ్‌ అంశంగా చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ సుప్రీం కోర్టు ముందుకు వెళ్లనుంది. అలాగే ఈ పిటిషన్‌పైనా విచారణ తేదీని కూడా ఖరారు చేసే ఛాన్స్‌ ఉంది. కానీ, ఈనెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. దీంతో బాబు పిటిషన్లకు వెకేషన్‌ ఎఫెక్ట్‌ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: బ్రహ్మణి మాటతో బిత్తరపోయిన జనసేన కేడర్‌

మరిన్ని వార్తలు