చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలి

18 Dec, 2020 07:57 IST|Sakshi

పిటిషనర్‌ ఎమ్మెల్యే ఆళ్ల  తరఫు సీనియర్‌ న్యాయవాది 

జూలైలో విచారణ చేస్తాం: సీజేఐ 

సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డేను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ అభ్యర్థించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు డబ్బులు ఇవ్వజూపారని, దీనిపై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ త్వరితగతిన విచారణ చేయాలంటూ ఎమ్మెల్యే ఆళ్ల దాఖలు చేసిన ఎర్లీ హియరింగ్‌ అప్లికేషన్‌ను గురువారం జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, న్యాయవాది అల్లంకి రమేశ్‌లు వాదనలు వినిపించారు.

‘2017 మార్చిలో పిటిషన్‌ దాఖలు చేయగా 2018 నవంబరులో పిటిషన్‌ ధర్మాసనం ముందుకొచ్చింది. నాడు జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ ధర్మాసనం ముందుకు రాగా 2019 ఫిబ్రవరిలో విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. 2019లో విచారణ చేయాల్సిన కేసు నెలలు గడుస్తున్నా బెంచ్‌మీదకు రాకపోవడంతో నవంబర్‌ 23, 2019న మరొక ఎర్లీ హియరింగ్‌ అప్లికేషన్‌  దాఖలు చేశాం. అయినప్పటికీ విచారణ జాబితాలోకి రాకపోవడంతో ఈ నెల మొదటి వారంలో మరో డైరెక్షన్‌ అప్లికేషన్‌ దాఖలు చేశాం’ అని ధర్మాసనానికి వివరించారు. పిటిషన్‌ వచ్చే ఏడాది వేసవి సెలవులు అనంతరం జులైలో విచారణ చేస్తామని జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే పేర్కొన్నారు. వచ్చే ఏడాది జులైలో విచారణకు ఏమీ అభ్యంతరం లేదని కానీ విచారణ తేదీని ఖరారు చేయాలని ప్రశాంత్‌ భూషణ్‌ కోరారు.

రాజకీయనేతల ప్రమేయం ఉన్న కేసులు వీలైనంత త్వరగా విచారణచేయాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన అంశాన్ని ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రస్తావించారు. ఈ  కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని, కానీ తెలంగాణ ఏసీబీ ఆ పేరు చేర్చడంలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రధాన కేసు జూలైలో విచాస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ‘ఎర్లీ హియరింగ్‌ అప్లికేషన్‌ పై విచారణ ముగిస్తున్నాం. ప్రధాన కేసు జూలై 14, 2021న తగిన ధర్మాసనం విచారిస్తుంది’  అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది.

మరిన్ని వార్తలు