సరళ వాస్తు గురూజీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి.. కోట్ల ఆస్తులు..

7 Jul, 2022 07:02 IST|Sakshi

హుబ్లీ: రాష్ట్రంతో పాటు ముంబై తదితర ప్రాంతాల్లో సరళ వాస్తు గురూజీగా పేరొందిన చంద్రశేఖర్‌ గురూజీ దారుణ హత్య రాష్ట్రంలో కలకలం సృష్టించింది. మంగళవారం హుబ్లీలో ప్రెసిడెంట్‌ హోటల్లో ఆయనను శిష్యులు మహంతేష్, మంజునాథ్‌ కత్తులతో పొడిచి చంపడం తెలిసిందే. పోలీసులు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగుచూశాయి. స్థిరాస్తుల విషయంలో నిందితులు, ఎంతో కాలంగా విశ్వాసంగా ఉన్న మహంతేష్‌ దంపతులతో గురూజీకి ఆస్తుల గురించి వివాదం తలెత్తింది.  ఇటీవల మహంతేష్‌ ఆస్తులను అమ్మగా రూ. 5 కోట్లు వచ్చిందని తెలిసింది.

ఆ రూ.5 కోట్ల మొత్తం తిరిగి ఇవ్వాలని మహంతేష్‌ను గురూజీ ఒత్తిడి చేశాడని, ఇదే హత్యకు కారణమైందని పోలీసులు అనుమానిస్తున్నారు. తన శిష్యులను బినామీ ఆస్తులకు వారసులుగా పెట్టడమే స్వామీజీ చేసిన పెద్ద తప్పు అని తెలుస్తోంది. ముఖ్యంగా ముంబైలో సరళవాస్తు కార్యాలయం పూర్తి బాధ్యతలను మహంతేష్‌ చూసేవాడు. మరో నిందితుడు మంజునాథ్‌ను కూడా పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. హుబ్లీలో ఇద్దరినీ ఒకే చోట ఉంచి తమదైన శైలిలో నిజాలు రాబట్టేందుకు విచారణ చేస్తున్నారు.  గురూజీ హత్య తనకెంతో బాధ కలిగించిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శంకర్‌ పాటిల్‌ మునేనకొప్ప తెలిపారు. 

చదవండి: (సరళ వాస్తు గురూజీ దారుణ హత్య.. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి)

నా భర్తకు శిక్ష పడాలి 
– నిందితుడు మహంతేష్‌ భార్య  
గురూజీని హత్య చేయడం తన భర్త మహంతేష్‌ చేసిన ఘోరమని నిందితుని భార్య వనజాక్షి తెలిపారు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. భర్త అకృత్యం వల్ల తాను పోలీసు స్టేషన్‌కు రావాల్సి వచ్చిందన్నారు. విచారణ జరిపిన తర్వాత తనను ఇంటికి పంపించారన్నారు. తన పిల్లలతో కలిసి జీవిస్తానని, చేసిన పాపాన్ని భర్త అనుభవించక తప్పదన్నారు.

ఇలాంటి దారుణానికి పాల్పడతారని తాను ఊహించలేదు, ఇంత దారుణంగా చంపేంత ద్వేషం ఏముందో తెలియదని ఆమె అన్నారు. అయితే తన పేరున మాత్రం గురూజీ ఎలాంటి ఆస్తులు చేయలేదన్నారు. తన భర్త పేరిట ఆస్తులు చేసిన విషయం కూడా తనకు తెలియదన్నారు. ఇప్పటికీ తాను కొన్న ఫ్లాట్‌కు వాయిదాల ద్వారా డబ్బులు చెల్లిస్తున్నానన్నారు. తామిద్దరూ పని చేస్తున్న సందర్భంలోనే గురూజీ విశాల హృదయంలో తమ పెళ్లి చేశారన్నారు. తన స్వంత పిల్లల్లా తమని చూశారని తెలిపారు. 

మరిన్ని వార్తలు