చంద్రయాన్‌ -3: విక్రమ్‌, ప్రగ్యాన్‌ మేల్కొల్పుపై ఇస్రో కీలక అప్‌డేట్‌

22 Sep, 2023 18:37 IST|Sakshi

చంద్రయాన్‌ 3 మిషన్‌ గురించి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కీలక అప్‌డేట్‌ అందించింది. చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌, ప్రగ్యాన్‌ రోవన్‌ను మేల్కొలిపే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. కాగా గత 14 రోజుల నుంచి చంద్రుడిపై చీకటి ఉండటంతో ల్యాండర్‌, రోవర్‌ స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాయి.

ప్రస్తుతం జాబిల్లిపై సూర్మరశ్మి వెలుతురు పడటంతో నేడు(శుక్రవారం) వీటిని పునరుద్దరించేందకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ల్యాండర్‌ నుంచి తమకు ఎలాంటి సిగ్నల్స్‌ అందలేదని ఇస్రో పేర్కొంది. తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని చెప్పింది.

చదవండి: ‍చైనా కవ‍్వింపు.. అరుణాచల్ ఆటగాళ్ల వీసాలు రద్దు

కాగా ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌ ఆగస్టు 23న విజయంతంగా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయిన విషయం తెలిసిందే. ల్యాండర్‌ దిగిన ప్రదేశాన్ని భారత్‌ ‘శివ శక్తి పాయింట్‌’గా నామకరణం చేసింది.  ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించింది. 14 రోజులపాటు అక్కడి వాతావరణ, నీటి పరిస్థితి, ఖనిజాల గురించి అధ్యయనం చేసి కీలక సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. ఇస్రో మొదట రోవర్ 300-350 మీటర్ల దూరం ప్రయాణించేలా ప్లాన్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల రోవర్ ఇప్పటి వరకు 105 మీటర్లు మాత్రమే కదిలింది. అయినప్పటికీ, మిషన్ దాని లక్ష్యాలను అధిగమించింది. 

అయితే చంద్రునిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. ఈ కారణంగా రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాకపోవడంతో సెప్టెంబర్ 2 రోవర్‌, సెప్టెంబర్‌ 4న ల్యాండర్‌ను  స్లీప్‌ మోడ్‌లో ఉంచారు. ఇక నేడు సూర్యోదయం కావడంతో రోవర్‌పై సూర్యర్శ్మి పడగానే, పరికరాలు వేడి అవుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ తర్వాత ల్యాండర్, రోవర్‌ నుంచి సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. రోవర్, ల్యాండర్‌ను నిద్రలేపి మళ్లీ క్రియాశీలకంగా మార్చితే.. చంద్రునిపై మరింత సమాచారాన్ని సేకరించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు.  
చదవండి: ఉగ్రవాద వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీకి లోక్‌సభ స్పీకర్‌ వార్నింగ్‌..

మరిన్ని వార్తలు