పదోన్నతుల్లో రిజర్వేషన్లకు దారి చూపండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి  

27 Oct, 2021 09:55 IST|Sakshi

తీర్పు రిజర్వు చేసిన ధర్మాసనం

సాక్షి, న్యూఢిల్లీ: ఏళ్లుగా ప్రధాన స్రవంతికి దూరంగా ఉండిపోయినా వారికి... రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రిజర్వేషన్లు రూపంలో సమాన అవకాశాలు కల్పించాలని చూస్తున్నామని, దీనికి తగిన దారి చూపించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పదోన్నతుల సమయంలో ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రానికి కచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.

ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లపై జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫు అటార్నీ జనరల్‌ వాదనలు వినిపిస్తూ... పదోన్నతుల్లో రిజర్వేషన్లపై తగిన మార్గదర్శకాలు రూపొందించకపోతే సమస్యలు తీవ్రం అవుతాయని, ఎప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని తెలిపారు.

చదవండి: (గుడ్‌ న్యూస్‌: విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా)  

‘‘పదోన్నతులు మెరిట్‌ ఆధారంగా తప్ప భర్తీ చేయడం లేదు. కానీ ఏళ్ల తరబడి ఓ వర్గం వెనకబడిపోయింది. దేశప్రయోజనాలు, రాజ్యాంగ ప్రయోజనాల దృష్ట్యా సమానత్వం తీసుకురావాలి. దామాషా ప్రాతినిధ్యంతోనే సమానత్వం వస్తుంది’’ అని వేణుగోపాల్‌ తెలిపారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఓ సూత్రం కావాలని, ఒక వేళ నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదిలేస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుందని వేణుగోపాల్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వాదనల అనంతరం ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.  

మరిన్ని వార్తలు