మీ చేతివేళ్లే ఫోన్‌ చార్జర్‌! చెమట నుంచి కరెంట్‌

15 Jul, 2021 05:07 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్‌ లేనిదే కాలం గడవని పరిస్థితి. రోజూ ఒకట్రెండు సార్లు చార్జింగ్‌ పెట్టాలి. ఎక్కడికైనా వెళ్తే చార్జర్‌ కూడా వెంట తీసుకెళ్లాలి, లేకుంటే వెళ్లిన చోట చార్జర్‌ కోసం వెతుకులాట తప్పదు. ఇక ముందు అలాంటి తిప్పలు తప్పనున్నాయి. విడిగా చార్జర్‌ అవసరమేదీ లేకుండా.. మీ చేతి వేళ్లే చార్జర్‌గా మారిపోనున్నాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు అలాంటి ఓ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా?

చిన్న ప్లాస్టర్‌లా వేసుకుంటే చాలు.. 
ఎప్పుడైనా చిన్నపాటి గాయమైతే వేసుకునే ప్లాస్టర్‌ తరహాలోనే.. ఈ సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పరిమాణం ఒక చదరపు సెంటీమీటర్‌ మాత్రమే. దీన్ని అమర్చిన స్ట్రిప్‌ను చేతివేలి కొసలకు చుట్టేసి పెడితే చాలు.. ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కూర్చుని ఉన్నా, పడుకున్నా, ఇంకేదైనా పనిలో ఉన్నా సరే.. ఆటోమేటిగ్గా అదే చార్జ్‌ అవుతూ ఉంటుంది.

చెమట నుంచి కరెంటు
ఈ పరికరంలో కార్బన్‌ ఫోమ్‌తో తయారైన ఎలక్ట్రోడ్‌లు, కొన్నిరకాల ఎంజైమ్‌లు ఉంటాయి. అవి చేతి వేళ్ల వద్ద ఏర్పడే చెమటను గ్రహించినప్పుడు.. రసాయనిక చర్యలు జరిగి విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. అంతేగాకుండా ఇందులోని ఎలక్ట్రోడ్‌ల దిగువన ‘పీజో ఎలక్ట్రిక్‌ మెటీరియల్‌ (ఒత్తిడికి లోనైనప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి చేసే పదార్థాలు)’ను అమర్చారు. దీనివల్ల మనం ఏదైనా వస్తువును పట్టుకోవడం, కీబోర్డుపై టైపింగ్‌ చేయడం, కారు, బైక్‌ నడపడం వంటివి చేసినప్పుడు వేళ్లకు ఉన్న స్ట్రిప్‌లపై ఒత్తిడిపడి.. విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. పరికరంలోని కెపాసిటర్‌లో ఆ విద్యుత్‌ నిల్వఅవుతుంది.

టెస్టులు.. పరికరాలకు.. 
ప్రస్తుతం ఒక స్ట్రిప్‌ను పది గంటల పాటు ధరిస్తే.. ఒక సాధారణ చేతి గడియారాన్ని 24 గంటలపాటు నడిపేంత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అదే పది వేళ్లకు పది స్ట్రిప్‌లను ధరిస్తే ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. ఈ స్ట్రిప్‌ ప్రస్తుతానికి ప్రాథమిక నమూనా మాత్రమేనని, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి విద్యుత్‌ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపారు. 

గుండెకు అమర్చే పేస్‌ మేకర్లు వంటి పరికరాలకు, బ్లడ్‌ షుగర్, విటమిన్, సోడియం సెన్సర్లు, ఇతర టెస్టుల కోసం శరీరానికి అమర్చే పరికరాలకు ఈ స్ట్రిప్‌ల సాయంతో విద్యుత్‌ అందించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. హా ప్రస్తుతం ఒక్కో స్ట్రిప్‌తో సెల్‌ఫోన్‌ను చార్జింగ్‌ చేయడానికి మూడు వారాలు పడుతుందని.. భవిష్యత్తులో కొద్దిగంటల్లోనే చార్జ్‌ అయ్యే స్థాయికి అభివృద్ధి చేస్తామని వివరించారు.
- సాక్షి సెంట్రల్‌డెస్క్‌

మరిన్ని వార్తలు