Cheetahs: చీతా.. పునరాగమనం

12 Jun, 2021 12:04 IST|Sakshi

భూమిపైనే అత్యంత వేగవంతమైన జీవిగా పేరున్న చీతా (ఒక రకం చిరుత).. భారతదేశంలోకి మళ్లీ అడుగుపెడుతోంది. అర్ధ శతాబ్దం క్రితం మన దేశంలో అంతరించిపోయిన ఈ జాతి.. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే నవంబర్‌లో మళ్లీ మన నేలపై పరుగులు తీయనుంది. 

చీతాల ప్రత్యేకత..
► సన్నగా నాజూగ్గా ఉండే చీతా.. పిల్లి జాతిలోని పెద్ద జంతువుల్లో ఒకటి. సుమారు 70 కేజీల బరువు ఉంటుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇమిడి పోగలదు. 

► కంటి కింద చారికలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ చారికలు సూర్యకాంతి నుంచి వాటి కళ్లకు రక్షణ కల్పిస్తూ వేటాడే జంతువును స్పష్టంగా చూడటానికి ఉపయోగపడతాయి. 

► చిరుతలాగే చుక్కలతో అందంగా ఉంటుంది. కానీ తన సహచర జీవిలా చెట్లు ఎక్కలేదు. 

► దౌడు తీస్తున్న సమయంలోనూ తన గతిని వెంటనే మార్చుకోగలదు, తన ఎరపైకి దూకగలదు. ఈ సమయంలో వాటి పొడవైన తోకే స్టీరింగ్‌లా పనిచేస్తుంది.  

► సోదరులైన మగ చీతాలు మూడు, నాలుగు కలసి గుంపుగా జీవిస్తాయి. కలసి వేటాడతాయి. కానీ ఆడ చీతా మాత్రం ఒక్కటే ఉంటుంది. పిల్లలను సంరక్షిస్తూ జీవిస్తుంది.
   
► భూమిపైన అత్యంత వేగంగా పరిగెత్తే జీవి ఇది. గంటకు సుమారు 70 మైళ్లు (112 కి.మీ) వేగంతో పరిగెత్తగలదు. ఈ వేగాన్ని కేవలం మూడు సెకన్లలోనే అందుకోగలదు. 

రెండు జాతులు..
ఆసియా రకం, ఆఫ్రికా రకం అనే రెండు జాతులు చీతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఆసియా రకం చీతా అంతరించి పోయే జాతుల్లో ఒకటి. కేవలం 70 నుంచి 80 వరకూ మాత్రమే బతికి ఉన్నాయి. వీటిని ఇరాన్‌ వంటి దేశాల్లో గ్రేహౌండ్‌ శునకాల్లాగా పెంచుకుంటున్నారు. వేటకు వీటిని ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 7 వేల ఆఫ్రికా చీతాలు ఉంటే.. వాటిల్లో ఎక్కువ సౌతాఫ్రికా, నమీబియా, బోట్సవానాల్లోనే నివసిస్తున్నాయి. 1980వ దశకంలో మలావీలో చీతాలు అంతరించి పోతే.. 2017లో 4 చీతాలను తీసుకొచ్చి అడవుల్లో వదిలారు. ఇప్పుడు అక్కడ వాటి సంఖ్య 24కు పెరిగింది. 

సమస్యలు ఏంటి..
► ఇతర వేటాడే జీవులైన సింహాలు, పులులు, చిరుతలు, హైనాలు, అడవి కుక్కల దాడుల వల్ల ఎక్కువగా చీతాలు చనిపోతూ ఉంటాయి. ఆఫ్రికాలో సగంపైగా చీతాల మరణాలకు సింహాలు, హైనాలే కారణం. వీటి నుంచి చీతాలు తమ కూనలను రక్షించుకోవడం కూడా చాలా కష్టం.

► తరచూ మనుషుల ఆవాసాల్లోకి చొరబడి పెంపుడు జంతువులను చంపుతాయి. దీంతో మనుషులు కూడా వాటిపై దాడి చేస్తారు. 


నిపుణులు ఏం చెబుతున్నారు..
► భారతదేశంలో అంతరించి పోయిన జీవిని మళ్లీ తీసుకొచ్చి సంరక్షించడం మంచిదే. కానీ దేశంలో అడవులు క్షీణించిపోతుండటం పెద్ద సమస్య. ఇప్పుడు ఉన్న వేటాడే జీవులకే ఆహారం లభ్యంకాని పరిస్థితి. దీని వల్ల వేటాడే జీవుల్లో ఆహార పోటీ పెరుగుతుంది. ఇది చీతాలకు శ్రేయస్కరం కాదు. 

► పులులు, చిరుతలు, అడవి కుక్కలు లేని చోట వాటిని వదలాలి. లేదంటే సంరక్షణాలయాల్లో వాటిని ఉంచి సంతతి పెరిగాక అడవుల్లో వదలాలి. 

► చీతాలను తీసుకొచ్చి అడవుల్లో వదిలేయడం వల్ల ఉపయోగంలేదు. ఫెన్సింగ్‌తో కూడిన రక్షణ వలయం ఏర్పరచినప్పుడే వాటి సంతతి పెరుగుతుంది

ఇప్పుడు ఎక్కడ..
► ప్రస్తుతం ఐదు మగ, మూడు ఆడ.. మొత్తం ఎనిమిది చీతాలను ఆఫ్రికా నుంచి భారత్‌కు తీసుకువస్తున్నారు. 

► వీటిని రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టనున్నారు. 

► మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో జింక జాతి జీవులు, అడవి పందులు ఎక్కువగా ఉండటం, అవి చీతాకు సహజ ఆహారం కావడం వల్ల ఆ పార్కును ఎంచుకున్నారు. 

► రాజస్థాన్‌లోని ముకుంద్ర హిల్స్‌ ప్రాంతంలోని పులుల సంరక్షణ ప్రాంతాన్ని కూడా చీతాల పునఃప్రవేశానికి ఎంపిక చేశారు. 

భారత్‌లో ఇలా..
► మొగల్‌ చక్రవర్తి అక్బర్‌ కాలంలో సుమారు 10 వేల చీతాలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వాటిలో వెయ్యి వరకూ ఆయన అధీనంలో ఉండేవట.

► చీతాల సంతతి పెంచడానికి జహంగీర్‌ కాలంలో కృత్రిమ గర్భధారణ పద్ధతులను కూడా అవలంభించారు.

► 1799లో 230 వరకూ చీతాలు భారత్‌లో ఉన్నాయి.
 
► అడవుల్లో సహజ ఆహారమైన జింకలు, దుప్పులు తగ్గిపోవడం, బ్రిటిష్‌ పాలకుల వేట కారణంగా చీతాల సంఖ్య క్రమంగా క్షీణించిపోయింది. 

► భారత దేశంలో చిట్టచివరి చీతా 1967–68 సంవత్సరాల్లో కనిపించింది.

► 1970లో 300 చీతాలను ఇరాన్‌ నుంచి భారత్‌కు తీసుకురావడానికి జరిగిన చర్చలు సఫలం కాలేదు. 

మరిన్ని వార్తలు