ఆత్మహత్య చేసుకోవడం ఎలా? నటిస్తూ.. పాఠశాల విద్యార్థి మృతి 

26 Sep, 2022 09:01 IST|Sakshi

సాక్షి, తమిళనాడు: చెన్నై పుళల్‌ సమీపంలో శనివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నటించిన పాఠశాల విద్యార్థి.. గొంతుకు దారం బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. చెన్నై పుళల్‌ సమీపంలోని బుద్దాగరం గ్రామం కామరజర్‌ నగర్‌కు చెందిన శ్రీనివాసన్‌ రెండో కుమారుడు కార్తీక్‌(11). అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన ఇద్దరు సోదరులకు ఎదురుగా గదిలో పరుపు మీద కుర్చీ వేసుకుని నైలాన్‌ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఎలా..? అని కార్తీక్‌  నటించి చూపిస్తూ ఉన్నాడు.

ఇందుకోసం కుర్చీపైకి ఎక్కి నిలబడి ఫ్యాన్‌ కొక్కికి నైలాన్‌ తాడు తగిలించి, మరో కొనను కార్తీక్‌ మెడకు చుట్టుకుని నటించాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా కుర్చీ కింద పడి పోవడంతో కార్తీక్‌ మెడకు నైలాన్‌ తాడు బిగుసుకుని మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న  పుళల్‌ పోలీసులు పాఠశాల విద్యార్థి కార్తీక్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: Hyderabad: మహిళ కిడ్నాప్‌.. సామూహిక అత్యాచారం?

మరిన్ని వార్తలు