కూల్‌డ్రింక్‌ తాగిన 18 మంది మహిళా కూలీలకు అస్వస్థత

4 May, 2022 16:17 IST|Sakshi

వేలూరు(చెన్నై): దుకాణంలో శీతల పానియం తాగిన 18 మంది మహిళా కూలీలు అస్వస్థతకు గురై.. ఆరణి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలోని మలయంబట్టు గ్రామానికి చెందిన కుమరేశన్‌కు చెందిన వ్యవసాయ పొలంలో అదే గ్రామానికి చెందిన మంజుల, శాంతి, విజయలక్ష్మి తో పాటు మొత్తం 18 మంది మహిళలు వ్యవసాయ పనులకు వచ్చారు. మధ్యాహ్నం ఎండలు తీవ్రం కావడంతో కలంబూరులోని ఓ దుకాణంలో కూల్‌డ్రింక్‌ తాగారు. వెంటనే 18 మంది వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో స్థానికులు గమనించి మలయంబట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆరణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  కలంబూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


మరో ఘటనలో..
6 నుంచి వీరరాఘవుడి బ్రహ్మోత్సవాలు 
తిరువళ్లూరు:
పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వైద్యవీరరాఘవుడి ఆలయ బ్రహ్మాత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక్కడ ఏటా చైత్రమాసంలో పది రోజుల పాటు ఉత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం 4.45 గంటలకు ధ్వజారోహణం,  అనంతరం తంగసభ్రం, తిరుమంజనం నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం సింహవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఉదయం గరుడసేవ, సాయంత్రం హానుమంత వాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. ఏడవ రోజు రథోత్సవం, 8వ రోజు అశ్వవాహన సేవ ఉంటుంది. తొమ్మిదో రోజు ఉదయం తీర్థవారి, పదో రోజు ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నట్లు ఆలయ నిర్వాహకులు వివరించారు.

చదవండి: యూపీలో దారుణం.. పోలీస్‌ స్టేషన్‌లోనే అత్యాచార బాధితురాలిపై పోలీస్‌ లైంగిక దాడి

మరిన్ని వార్తలు