గతంలో ఎమ్మెల్యే.. ప్రస్తుతం బతుకు జీవనానికి మేకల పెంపకం

18 Jul, 2021 20:21 IST|Sakshi

చెన్నై: దివంగత సీఎం జయలలిత నోట చెల్లకుట్టి (ముద్దుబిడ్డ)గా పిలవడ్డ ఓ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మేకల్ని పెంచుతున్నారు. బతుకు జీవనం కోసం బెల్లం పట్టిలో రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. 2003లో తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌ కులం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ప్రకటించారు. అధికార అన్నాడీఎంకే అభ్యర్థిగా ఎవర్ని నిలబెట్టాలో అన్న చర్చ సాగుతున్న సమయంలో అనూహ్యంగా కుగ్రామం నుంచి నీలమేఘ వర్ణం అనే రైతు తెరపైకి వచ్చాడు.

ఎన్నికల ఖర్చుకు కూడా తన వద్ద చిల్లి గవ్వ లేదని పార్టీ దృష్టికి ఆ రైతు తీసుకొచ్చాడు. అయితే, పార్టీ కోసం శ్రమిస్తున్న నిజమైన కార్యకర్తగా ఉన్న నీల మేఘ వర్ణం సాత్తాన్‌కులం అభ్యర్థి అని అప్పటి సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స్పష్టం చేశారు. అమ్మ ఆజ్ఞతో ఎన్నికల్లో పోటీ చేసిన నీల మేఘ వర్ణం ఉప ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సమయంలో చెల్లకుట్టి అంటూ నీల మేఘంను జయలలిత వర్ణించారు. ఆ తర్వాత పరిణామాలతో పునర్విభజనలో సాత్తాన్‌కులం ఎన్నికల చిత్ర పటం నుంచి గల్లంతైంది.  

ఎప్పటికీ రైతునే.. 
ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం అభివృద్ధికి తన శాయశక్తులా నీలమేఘం శ్రమించారు. అమ్మ ఆశీస్సులో గ్రామాల్లో రోడ్లు, ఆరోగ్య కేంద్రాల  ఏర్పాటు చేయించారు. అయితే, ఇప్పడు ఈ నీలమేఘం సాధారణ కార్యకర్తగా అన్నాడీఎంకేలో మారారు. ఇప్పుడు ఆయన మేకల్ని పెంచుతూ, తన గ్రామంలోని బెల్లం పట్టిలో రేయింబవళ్లు పనిచేస్తున్నారు. తనకు ఈ పని కొత్త కాదు అని, తన తండ్రి ఇచ్చి వెళ్లిన సంపద అంటూ నీల మేఘం తనను కలిసిన మీడియాతో చెప్పారు.

పదువులు వస్తాయి...వెళ్తాయని.. అయితే, తాను ఎప్పడూ సాదాసీదా రైతునే అని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి చిన్న పాటి బెల్లం పట్టి ఇచ్చి వెళ్లాడని, దాని ద్వారా వచ్చిన సంపాదనతో మేకల్ని కొని మేపుకుంటున్నట్టు పేర్కొన్నారు. అమ్మ ఉన్నప్పుడు పార్టీలో గౌరవం ఉండేదని, ఇప్పుడు పట్టించుకునే వాళ్లు లేకున్నా, తాను మాత్రం రెండాకులపై ఉన్న విశ్వాసంతో నేటికి అన్నాడీఎంకే కార్యకర్తనే అని ఆనందంతో ముందుకు సాగారు.  

మరిన్ని వార్తలు