లోన్‌ యాప్‌.. కటకటాల్లోకి చైనీయులు

4 Jan, 2021 08:28 IST|Sakshi

బెంగళూరు నుంచి బెదిరింపులు 

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి బృందం 

ఇద్దరు చైనీయులు సహా నలుగురి అరెస్టు 

సాక్షి, చెన్నై: రుణాలు ఇస్తామంటూ తియ్యటి మాటాలతో ఆకర్షించి, ఆ తర్వాత వడ్డీలపై వడ్డీలను బాధుతూ వేధింపులకు గురి చేస్తూ వచ్చిన లోన్‌ యాప్‌ గుట్టును చెన్నై పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా బెదిరింపుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నిర్వాహకులతో పాటు ఆ యాప్‌ ప్రతినిధులుగా ఉన్న ఇద్దరు చైనీయుల్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. చెన్నైకి చెందిన గణేష్‌ కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో మొబైల్‌ ప్లే స్టోర్‌లో ఉన్న లోన్‌ యాప్‌లపై దృష్టి పెట్టాడు. ఇందులోని ఓ యాప్‌ను ఆశ్రయించిన కొన్ని క్షణాల్లో రూ. 5వేల రుణం ఖాతాలో పడింది. వారం తర్వాత వడ్డీ ఏదీ అంటూ మెసేజ్‌లు మొదలయ్యాయి. తాను చెల్లించాల్సిన మొత్తంలో సగం కట్టేసినా, వారానికి రూ. పదిహేను వందలు వడ్డీ చెల్లించాలంటూ మొదలైన  మెసేజ్‌లు చివరకు వేధింపుల వరకు వెళ్లింది. ఆందోళనకు గురైన గణేష్‌ చెన్నై సెంట్రల్‌ క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. గణేష్‌ మరికొన్ని యాప్‌ల నుంచి కూడా రుణం పొంది ఉండడంతో, అన్నింటికీ కలిపి బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన కేంద్రం నుంచి ఈ వేధింపులు వస్తున్నట్టుగా విచారణలో తేలింది. 

గుట్టు రట్టు..కటకటాల్లోకి ... 
ఈ యాప్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబర్‌ క్రైం వర్గాలు గణేష్‌ నంబర్లకు వస్తున్న బెదిరింపులు, తిట్ల పురాణాల్ని రికార్డు చేశారు. సమగ్ర సమాచారంతో ప్రత్యేక బృందం బెంగళూరుకు పయనం అయింది. అక్కడ ఓ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఉండడాన్ని గుర్తించారు. ఆ సెంటర్‌ నిర్వాహకులు ప్రమోద్, పవన్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. దేశంలో చైనా యాప్‌లను నిషేధించి ఉన్న నేపథ్యంలో చైనాకు చెందిన సంస్థకు అనుకూలంగా ఈ కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తుండడం వెలుగు చూసింది. బెంగళూరులో తిష్ట వేసి తమ కార్యకలాపాల్ని సాగిస్తూ వస్తున్న చైనా లోన్‌ యాప్‌ కంపెనీకి చెందిన షియో యమోవు, ఉయున్లూన్‌ అరెస్టు చేశారు. చైనాలో ఉన్న తమ చైర్మన్‌ హంక్‌ ఇచ్చే సూచనలకు అనుగుణంగా తాము ఇక్కడ వ్యవహారాలు నడుపుతున్నామని వారు ఇచ్చిన సమాచారం పోలీసులకు పెద్ద షాకిచ్చింది. దీంతో ఆ నలుగుర్ని అరెస్టు చేసి శనివారం చెన్నైకు తరలించారు. తాంబరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి కట కటాల్లోకి నెట్టారు. చెన్నై పోలీసు కమిషనర్‌ మహేష్‌ కుమార్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ  కొన్ని రకాల ప్లే  స్టోర్లలోని యాప్‌ల జాగ్రత్తలు తప్పని సరి అని సూచించారు.
(చదవండి: లోన్‌ యాప్‌ వేధింపులు: మరో వ్యక్తి బలి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు