కరోనా: వామ్మో రెండు లక్షల కేసులు

10 Apr, 2021 16:44 IST|Sakshi

తమిళనాడు: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు, నిబంధనలు పాటించడం లేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పిస్తూనే వినని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఆ విధంగా కరోనా నిబంధనలు పాటించని వారిపై తమిళనాడు పోలీసులు భారీగా కేసులు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని ఇప్పటివరకు రెండు లక్షల 36 వేల 119 కేసులు బుక్‌ చేశారు. మాస్క్‌ ధరించకపోవడం, భౌతిక దూరం విస్మరించడం, శానిటైజర్‌ వాడకపోవడం వంటి అంశాల వారీగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. 

మీ ఆరోగ్యం కోసమే నిబంధనలు ఉన్నాయని హెచ్చరిస్తున్నా ప్రజలు బేఖాతర్‌ చేస్తుండడంతో కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చెన్నె పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌కుమార్‌ అగర్వాల్‌ మీడియాతో మాట్లాడుతూ పై విషయాలు తెలిపారు. కరోనాను దత్తత తీసుకున్నట్లు ఉంది.. ప్రజలు ఈ విషయం గుర్తుంచుకోవాలి అని హెచ్చరించారు. అంటే కరోనాను మనకై మనమే నిర్లక్ష్యం వహించి తెచ్చుకున్నామని వివరించారు. ఎన్నికలు ముగియడంతో కరోనా నిబంధనలు పాటించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్‌ వాడడం వంటివి చేయడంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. 

అయితే కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు. మాస్క్‌ ధరించని కేసులే 85,764 ఉన్నాయని, 117 కేసులు క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘన, ఇక భౌతిక దూరం పాటించని కేసులు ఏకంగా 1,50,318 ఉన్నాయని కమిషనర్‌ ప్రకటించారు. ఇలా కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మొత్తం 2,36,199 కేసులు నమోదు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌కుమార్‌ అగర్వాల్‌ తెలిపారు.

కరోనా నిబంధనలపై అవగాహన కల్పిస్తున్న చెన్నె పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ కుమార్‌ అగర్వాల్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు