Tamil Nadu: కొనసాగుతున్న వర్ష బీభత్సం .. 14 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌  

3 Nov, 2022 09:21 IST|Sakshi

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై మహానగరంలో పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు, సబ్‌వేలు వరద నీటిలో నిండిపోయాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో నగరంలో అత్యవసర చర్యలు చేపట్టాలని సీఎం స్టాలిన్‌ అధికారులను ఆదేశించారు. కంట్రోల్‌ రూం సిబ్బంది నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. బాధితులకు అండగా ఉండాలని సూచించారు. చెన్నై కార్పొరేషన్‌ సిబ్బంది అనేక ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని భారీ మోటార్ల ద్వారా నగరం బయటకు పంపిస్తున్నారు.

సాక్షి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా వరుణుడు బుధవారం కూడా బీభత్సం సృష్టించాడు. ఈశాన్య రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 14 జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ఈ వర్షాలు 6వ తేదీ వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక  చెన్నై నగరంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 

రెండు రోజులుగా.. 
శ్రీలంక నుంచి పశ్చిమ తమిళనాడు వరకు విస్తరించి ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం సాయంత్రం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. మంగళ, బుధవారం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు, రాణిపేట సహా ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అత్యధిక శాతంగా తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌ ప్రాంతంలో 13 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లో అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. శివగంగై, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కడలూరు, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుదురై, పుదుకోట్టై, కన్యాకుమారి, నీలగిరి, కోయంబత్తూరు తదితర 17 జిల్లాల్లో వరుణ బీభత్సం కొనసాగింది. 

జాలర్లకు సూచనలు.. 
నైరుతి బంగాళాఖాతంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీస్తుండడంతో జాలర్లు మరో 2 రోజులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. చెన్నైలో నవంబర్‌ 1వ తేదీ ఒక్కరోజే 8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గత 72 ఏళ్లలో నవంబర్‌ నెలలో నమోదైన మూడో అత్యధిక వర్షపాతం ఇది.. అని వాతావరణ కేంద్రం ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా బుధవారం చెన్నై, రాణిపేట, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాల లు, కళాశాలలకు బుధవారం సెలవు ప్రకటించారు. వేలూరు, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు, విల్లుపురం జిల్లాల్లో పాఠశాల స్థాయి విద్యార్థులకు మాత్రమే సెలవులిచ్చారు. 

అండమాన్‌కు 14 విమానాలు రద్దు 
చెన్నై విమానాశ్రయం నుంచి రోజూ ఏడు విమానాలు అండమాన్‌కు వెళ్తాయి. అలగే అక్కడి నుంచి చెన్నైకి మరో ఏడు విమానాలు వస్తాయి. అండమాన్‌ ప్రముఖ పర్యాటక ప్రాంతం కావడంతో చెన్నై నుంచి అధిక సంఖ్యలో ప్రయాణికులు విమానాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే అండమాన్‌ సముద్రంలో భీకర గాలుల కారణంగా విమానాలు ల్యాండ్‌ చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అదేవిధంగా అండమాన్‌ విమానాశ్రయంలో పర్యవేక్షణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా బుధవారం ఉదయం నుంచి 4వ తేదీ వరకు చెన్నై, అండమాన్‌ మధ్య నడిచే 14 విమానాలను రద్దు చేస్తున్నట్లు చెన్నై ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. అదేవిధంగా ఆ రోజుల్లో టిక్కెట్‌లను బుక్‌ చేసుకున్నవారు మరో రోజుకు మార్చుకోవచ్చని సూచించారు. 

మంత్రులు, మేయర్‌ అత్యవసర సమావేశం 
భారీ వర్షాల కారణంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి చెన్నై కార్పొరేషన్‌ కార్యాలయమైన రిప్పన్‌ బిల్డింగ్‌లో బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. మంత్రులు సుబ్రమణియన్, కేఎన్‌.నెహ్రూ, మేయర్‌ ప్రియ, డిప్యూటీ మేయర్‌ మహేష్‌ కుమార్,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వర్ష ప్రభావిత జిల్లాల్లో చేపట్టాల్సిన పలు చర్యల, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి చర్చించారు. 

కార్పొరేషన్‌ సిబ్బందికి.. అభినందన 
చెన్నై నగరంలో అత్యధిక స్థాయిలో వర్షం కురిసినప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని మంత్రి సుబ్రమణియన్‌ వెల్లడించారు. చెన్నై నగరంలో 200 చోట్ల తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. చెన్నైలో 50 ఏళ్ల నాటి భారీ వృక్షాలు మైలాపూర్, అభిరామపురం, ట్రిప్లికేన్, రాయపురం ప్రాంతాల్లో నేలకొరిగాయని, వాటిని సిబ్బంది వెంటనే  తొలగించారని తెలిపారు.

మంగళవారం రాత్రి 20 వేల మంది కార్పొరేషన్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించి నగరంలో నిలిచిన వరద నీటిని ఎప్పటికప్పుడు తొలగించినట్లు చెప్పారు. బుధవారం కూడా నిల్వ ఉన్న నీటిని మోటార్ల ద్వారా తొలగిస్తున్నట్లు తెలిపారు. కాగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షలకు రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగని రీతిలో చర్యలు చేపట్టిన చెన్నై కార్పొరేషన్‌ సిబ్బందిని దక్షిణ రైల్వే మేనేజర్‌ ట్విట్టర్‌లో అభినందించారు. 

కాల్‌ సెంటర్‌.. 
తాగునీటి బోర్డు ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ నిమిత్తం 24 గంటల కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు తాగునీరు, మురుగు నీటి సమస్యలపై 044–45674567 ఫోన్‌ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. చెన్నై నగరంలో కురుస్తున్న భారీ వర్షాల ఆరణంగా ప్రజలకు సహాయం అదించేందుకు 900 మంది అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే నిమిత్తం 40 పడవలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. 

పుళల్‌ – చెంబరంబాక్కం నుంచి నీటి విడుదల 
భారీ వర్షాల కారణంగా చెన్నైకి తాగు నీటిని అందించే చెరువులకు ఇన్‌ఫ్లో పెరిగింది. పుళల్‌ చెరువుకు బుధవారం ఉదయం 2 వేల ఘనపుటడుగుల నీరు వచ్చి చేరింది. చెరువు సామర్థ్యం 21 అడుగులు కాగా, 19 అడుగుల మేరకు నీరు చేరింది. దీంతో పుళల్‌ చెరువు నుంచి బుధ వారం సాయంత్రం 100 ఘనపుటడుగుల నీటిని విడుదల చేశారు. పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ప్రకటించారు. అదేవిధంగా చెంబరంబాక్కం చెరువు నుంచి కూడా 100 ఘనపుటడుగుల నీటిని విడుదల చేశారు.

నేతన్నను దెబ్బతీసిన వరుణుడు
పళ్లిపట్టు: భారీ వర్షాల కారణంగా నేతపరిశ్రమ డీలాపడింది. పళ్లిపట్టు, ఆర్కేపేట, తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో ముసురు వర్షం వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అమ్మయార్‌కుప్పం, ఆర్కేపేట పొదటూరుపేట, సొరకాయపేట, అత్తిమా మంజేరిపేట, బుచ్చిరెడ్డిపల్లె, మద్దూరు, శ్రీకాలికాపురం, వెడియంగాడు పరిసర ప్రాంతాల్లో మగ్గం పనులు ఆగిపోయాయి. వర్షం తగ్గితే నూలు ఆరబెట్టి పడుగులు తయారు చేస్తే తప్పా తమకు ఉపాధి ఉండదని నేతన్నలు వాపోతున్నారు.  

వేలూరు, తిరువణ్ణామలైలో..
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలైలో రోడ్లు, వీధులు వర్షపు నీటితో నిండిపోయాయి. నేతాజీ మార్కెట్‌ జలమయం కావడంతో వ్యాపారులు, కొనుగోలు దారులు ఇబ్బంది పడ్డారు. విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. వేలూరు జిల్లా ఆంబూరు ప్రాంతంలో ఏళ్ల నాటి చింత చెట్టు నేల కూలిపోవడంతో ట్రాఫి క్‌ స్తంభించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఏవా వేలు తెలిపారు. తిరుపత్తూరు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అమర్‌ కుస్వా అధ్యక్షతన వివి ధశాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 

సీఎం ఆకస్మిక పరిశీలన 
చెన్నై చేపాక్కం.. ఎళిలగంలోని రాష్ట్రస్థాయి అత్యవసర కంట్రోల్‌ రూమ్‌ను ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ను సీఎం స్వీకరించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో వర్షం పరిస్థితులపై సమీక్షించారు.  

మరిన్ని వార్తలు