ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు ధీటుగా ‘బిగ్రాఫి’

16 Aug, 2020 20:44 IST|Sakshi

చెన్నై: ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలకు సవాలు విసిరేలా బిగ్రాఫి అనే యాప్‌ను తమిళనాడు తేనికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి రూపొందించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. తేని, కర్నల్‌ జాన్‌ బెన్నిక్విక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన బాలమురుగన్‌ (45), జయమణి దంపతుల కుమారుడు మిధున్‌ కార్తిక్‌ (13) కుమార్తె కనిష్కాశ్రీ (10). ఇరువురూ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిది, ఐదో తరగతి చదువుతున్నారు. కరోనా వైరస్‌ కారణంగా గత ఐదునెలలుగా పాఠశాలలు తెరవనందున ఇంట్లో ఉన్న మిధున్‌ కార్తిక్‌ ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియాలకు ప్రత్యామ్నాయంగా బిగ్రాఫి అనే కొత్త యాప్‌ను ఆవిష్కరించాడు. లడాక్‌ సరిహద్దు వివాదంతో చైనా టిక్‌టాక్, హలో యాప్‌ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో మిధున్‌ కార్తిక్‌ బిగ్రాఫి యాప్‌ను కనుగొన్నాడు. (ఫేస్‌బుక్‌ను బీజేపీ నియంత్రిస్తోంది: రాహుల్‌)

దీనిగురించి మిధున్‌ కార్తిక్‌ మాట్లాడుతూ పూర్తిగా భద్రతా అంశాలతో రూపొందించబడిన బిగ్రాఫి యాప్‌లో సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా ప్రవేశించలేమని అన్నాడు. సమాచారం చోరీ, పేజీ హ్యాకింగ్‌కు వీలులేని విధంగా రూపొందించినట్లు పేర్కొన్నాడు. మొదటి విడతగా మెసేజ్‌ షేరింగ్, ఫోటో అప్‌లోడ్, షేరింగ్, లైక్‌ చేయడం, అభిప్రాయం వ్యక్తం చేయడం వంటి అంశాలున్నట్లు తెలిపాడు. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గూగుల్‌ ప్లేస్టోర్‌లో బిగ్రాఫి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నాడు. ప్రస్తుతం ఆరు వేల మందికి పైగా తన యాప్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపాడు. మిధున్‌ కార్తిక్‌ తండ్రి బాలమురుగన్‌ మాట్లాడుతూ మిధున్‌ కార్తిక్‌కు చిన్ననాటి నుంచే కంప్యూటర్‌లో ఆసక్తి అధికమని, దీంతో ప్రోగ్రామింగ్‌ నేర్చుకున్నాడని తెలిపారు. యోగా వెబ్‌సైట్‌ కూడా రూపొందించినట్లు తెలిపారు. (గురుకుల విద్యార్థులకు వాట్సాప్‌ క్లాసులు )

మరిన్ని వార్తలు