ఆటో దిగుతుండగా.. అసభ్యంగా తాకి పారిపోయాడు: ట్రెండింగ్‌లో వేధింపుల పర్వం

27 Sep, 2022 19:49 IST|Sakshi

వైరల్‌: ఉబెర్‌ ద్వారా ఆటో నడిపే ఓ డ్రైవర్‌.. ఓ కాలేజీ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. చీకట్లో లైంగికంగా వేధించాడు. కానీ, ఆమె ఎదురు తిరగడంతో.. ఆటో వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. చెన్నైలో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు ట్విటర్‌ ట్రెండ్‌ ద్వారా వైరల్‌ అవుతోంది. 

ఇషితా సింగ్‌ అనే యువతి చెన్నై ఏసీజే ఇండియాలో జర్నలిజం కోర్సు చేస్తోంది. ఆదివారం రాత్రి ఈస్ట్‌ కోస్ట్‌ మద్రాస్‌ రెస్టారెంట్‌ నుంచి సెమ్మన్‌చెరిలోని ఐబీఐఎస్‌ ఓఎంఆర్‌ హోటల్‌కు ఆమె ఉబెర్‌ ఆటో బుక్‌ చేసుకుంది. ఆ సమయంలో ఆమెతో పాటు ఆమె స్నేహితురాలు కూడా ఉంది. అయితే.. గమ్యస్థానానికి చేరుకున్నాక కిందకు దిగే క్రమంలో డ్రైవర్‌ ఆమెను అసభ్యంగా తాకాడు. దీంతో ఆమె గట్టిగా అరిచి.. అతనితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ఆ ఇద్దరూ అతన్ని అడ్డుకునే యత్నం చేయగా.. అతను ఆటో అక్కడే వదిలేసి పారిపోయాడు.

వెంటనే ఆమె పోలీసులకు ఫోన్‌ చేయగా.. అరగంట తర్వాత ఓ అధికారి అక్కడకు చేరుకున్నాడు. ఉదయం వరకు వేచిచూడాలని, ఈ రాత్రి స్టేషన్‌లో మహిళా సిబ్బంది ఉండరని అతను ఆమెకు సూచించాడు. అయినప్పటికీ స్టేషన్‌ బయటే ఉండి.. ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చింది. ఆపై జరిగిన ఘటనను పూసగుచ్చినట్లుగా వివరిస్తూ.. మొత్తం ట్విటర్‌ నిండా ఫొటోలతో వివరించుకుంటూ పోయింది. ఈ క్రమంలో.. 

ఆమె ట్వీట్లకు చాలామంది రకరకాలుగా స్పందించారు. పలువురు ప్రముఖులు సైతం ఆమె ట్వీట్లను రీట్వీట్లు చేశారు. చివరకు తంబారం పోలీస్‌ కమిషనరేట్‌ ఆమె ట్వీట్లకు స్పందించింది. కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలిస్తున్నట్లు తెలిపింది. అయితే.. డ్రైవర్‌ సెల్వంను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీతో పాటు ఆ ఆటోను సైతం పోలీసులు సీజ్‌ చేసినట్లు బాధిత యువతి తాజాగా ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. మరోవైపు ఉబెర్‌ సైతం ఈ ఘటనపై స్పందించింది. ఇషితను ప్రయాణానికి, ఘటనకు సంబంధించిన వివరాలను వ్యక్తిగతంగా తమకు తెలియజేయాలని కోరింది.

ఇదీ చదవండి: రష్యా చెరలో అంతగా హింసను అనుభవించాడా?

మరిన్ని వార్తలు