రోడ్డుపై నిమ్మకాయలతో హిజ్రాతో పూజలు.. ఎస్‌ఐ చేసిన పనికి షాక్‌లో ప్రయాణీకులు

10 Jun, 2023 18:15 IST|Sakshi

చెన్నై: రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు చనిపోతే.. పోలీసులు ఏం చేస్తారు?. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటారు. హెచ్చరికల బోర్డులు అక్కడ పెడతారు. కానీ, ఓ పోలీసు అధికారి మాత్రం దుష్టశక్తుల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి.. వినూత్నంగా ఆలోచించాడు. మూఢ నమ్మకంతో ఎక్కువ ప్రమాదాలు జరిగే రోడ్డుపై హిజ్రాతో పూజలు చేయించాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, అధికారులు సదరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఈ షాకింగ్‌ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. చెన్నైలోని వనాగారం, మధురవాయల్‌ సమీపంలోని రహదారిలో ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఎస్‌ఐ పళని సొంత నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఒక హిజ్రాను పోలీస్‌ వాహనంలో అక్కడకు రప్పించాడు. ఎక్కువ ప్రమాదాలు జరిగే రోడ్డు ప్రాంతంలో పూజలు చేయించాడు. ఆ హిజ్రా గుమ్మడికాయ, నిమ్మకాయలతో ఆ రోడ్డుకు దిష్టి తీసింది. అనంతరం వాటిని నేలకేసి కొట్టింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక, ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీనిపై ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ కపిల్‌ కుమార్‌ శరత్కర్‌ స్పందించారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ పళనిని ఆ విధుల నుంచి తప్పించడంతోపాటు కంట్రోల్‌ రూమ్‌కు రిపోర్ట్‌ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కపిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పోలీసులు అయి ఉండి తన వృత్తికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. తన వ్యక్తిగత నమ్మకంతో అలా రోడ్డుపై పూజలు చేయడం కరెక్ట్‌ కాదు. రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి నివారణకు చర్యలు చేపట్టాలి. దుష్టశక్తిని తరిమే పేరుతో ఇలాంటి పూజలు చేయడం సరికాదని పేర్కొన్నారు. అతడిపై చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: దేశంలో తొలిసారి.. ముంబై అరుదైన ఘనత..

మరిన్ని వార్తలు