ఆరంకెల జీతం వదిలి.. మెకానిక్‌గా మారిన మహిళ

29 Jul, 2021 08:08 IST|Sakshi

కొంచెం కొత్తగా చెయ్‌

కేబిన్‌లో కూచుని చేసే ఉద్యోగంఆమెకు బోర్‌ కొట్టింది. కొన్నాళ్లు బండి మీద దేశం తిరిగింది. కొన్నాళ్లు బండ్లు రిపేర్‌ చేసే ఆటోమొబైల్‌ రంగంలోపని చేసింది. ఇప్పుడు ఆమె సొంత గ్యారేజ్‌ తెరిచింది. స్త్రీలు మెకానిక్‌ గ్యారేజ్‌లు నడపడం అరుదు. కాని చెన్నైకి చెందిన అఫునిసా చౌదరి ఇప్పుడు ‘కారు ఆమె చేతుల్లో పెడితే దిగుల్లేదు’ అనే పేరు సంపాదించుకుంది. కొత్తగా ఏదైనా చేస్తే ఇలాగే పేరొస్తుంది.

సాధారణంగా ఏ గ్యారేజ్‌లో అయినా అడ్మినిస్ట్రేషన్‌లో మహిళా ఉద్యోగులు కనిపిస్తుంటారు. గ్యారేజ్‌ లోపల మాత్రం మగవారిదే రాజ్యం. కాని చెన్నై నీలాంకరి ఏరియాలో ఉన్న ‘మోటర్‌హెడ్స్‌’ గ్యారేజ్‌లోకి వెళ్లినప్పుడు మాత్రం గ్యారేజ్‌ లోపల అఫునిసా చౌదరి మెకానిక్‌ యూనిఫామ్‌లో కనిపిస్తుంది. ఆమె యూనిఫామ్‌లో లేనప్పుడు మొదటిసారి వచ్చిన కస్టమర్‌ ఆమెను రిసెప్షనిస్ట్‌ అని పొరపడుతుంటాడు. ‘నా కారు టెస్ట్‌ డ్రైవ్‌కి మెకానిక్‌ని పిలుస్తారా’ అన్నప్పుడు ‘పదండి నేనే వస్తాను’ అని అఫునిసా అంటుంది. మోటర్‌హెడ్స్‌కు ఆమే అధినేత. అందులో ఆమే మెకానిక్‌ కూడా.

ఉద్యోగం బోర్‌కొట్టి
నలభై ఏళ్ల అఫునిసా చౌదరి గతంలో ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో సీనియర్‌ ర్యాంక్‌లో పని చేసింది. ఆపరేషన్స్‌ విభాగం చూసేది. క్యాబిన్, దర్జా, మంచి జీతం అన్నీ నడిచేవి. కాని ఆమెకు ఆ ఉద్యోగం బోర్‌ కొట్టింది. ఆమెకు ఆటోమొబైల్‌ రంగం అంటే ఇష్టం. ఆమె దగ్గర కొన్ని పాత టూ వీలర్లల కలెక్షన్‌ ఉంది. ‘బాబీ’ సినిమాలో కనిపించే స్కూటర్‌ మొదలు ఇప్పుడు కనిపించకుండా పోయిన యమహా ఆర్‌.ఎక్స్‌ 135 లాంటి బండ్లు కూడా ఉన్నాయి. యమహా మీద ఆమె తరచూ దూరప్రయాణాలు కూడా చేస్తుంటుంది. ఉన్నచోటే ఉండిపోవడం నా వల్ల కాదు అని పదేళ్ల క్రితం 2010లో ఆ ఉద్యోగం మానేసింది. ఏం చేస్తావు అని ఆ కంపెనీ వాళ్లు అడిగితే కార్ల గురించి తెలుసుకుంటా అని చెప్పిందామె.

పదేళ్లు ఆటోమొబైల్‌ రంగంలో...
దేశంలో కార్ల రంగం బాగా వృద్ధి చెందింది. ఒక కొత్త మోడల్‌ వచ్చేలోపు ఇంకో కొత్త మోడల్‌ రిలీజ్‌ అవుతోంది. అన్ని కంపెనీలకు ఆథరైజ్డ్‌ సర్వీస్‌ స్టేషన్స్‌ ఉంటాయి. కాని ఆథరైజ్డ్‌ సర్వీస్‌ స్టేషన్‌లో పెద్దగా చర్చలకు తావుండదు. వారు చెప్పిన ధరలకు చెప్పిన సర్వీస్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ధరలు ఒక్కోసారి ఎక్కువగా ఉంటాయి కూడా. మారుతి నుంచి మొదలెట్టి బి.ఎం.డబ్లు్య వరకు అన్ని కార్ల యజమానులు మంచి గ్యారేజ్‌ ఉంటే ఆ వైపు చూడటానికే ఇష్టపడతారు.

‘నా గ్యారేజ్‌ అలా ఉండాలని నేను పదేళ్లు గ్రౌండ్‌ వర్క్‌ చేశాను’ అంటుంది అఫునిసా చౌదరి. ‘పదేళ్లు నేను చాలా గ్యారేజ్‌లను పరిశీలించడంలో గడిపాను. రిపేర్లు, స్పేర్‌పార్ట్‌లు, ఏ కారుకు ఎంత రిపేర్‌ అవసరం వంటి వివరాలన్నీ తెలుసుకున్నాను. ఇక కారులోని ఎలక్ట్రానిక్స్‌ది ఒక కీలకవ్యవస్థ. ఆ ఎలక్ట్రానిక్స్‌ రిపేర్లను చేయడంలో తగిన శిక్షణ కలిగిన మెకానిక్‌లు ఉండాలని తెలుసుకున్నాను. అన్ని సౌకర్యాలను సిద్ధం చేసుకుని మల్టీబ్రాండ్‌ గ్యారేజ్‌ను 2020లో ప్రారంభించాను’ అంటుంది అఫునిసా.

లాక్‌డౌన్‌ సవాలు
గ్యారేజ్‌ తెరిచిన వెంటనే అఫునిసాకు ఎదురు దెబ్బ తగిలింది. కరోనా వల్ల చెన్నైలో లాక్‌డౌన్‌ వచ్చి మూడు నెలల పాటు మూసేయాల్సి వచ్చింది. ‘ఇది కూడా ఒక విధంగా మంచిదే అయ్యింది. ఉపాధి పొందలేని వర్గాల నుంచి కొంత మంది కుర్రాళ్లను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చేందుకు మేము నిశ్చయించుకున్నాం’ అని అఫునిసా అంటుంది. ఆమెకు ఈ గ్యారేజ్‌ స్థాపన వెనుక ఒక లక్ష్యం ఉంది. కేవలం దీనిని ఆదాయ వనరుగా కాక దిగువ వర్గాల యువతీ యువకులకు పని నేర్పించి వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయాలనేది ఆమె భావన. ‘మేము పని నేర్పించి వారు జీవితంలో స్థిరపడటానికి కావాల్సిన సహాయం కూడా చేస్తాం’ అని అఫునిసా అంది.

నోటిమాట ప్రచారం
మొదటి లాక్‌డౌన్‌ ముగిసి రెండో లాక్‌డౌన్‌ వచ్చేలోపు నోటి మాట మీదుగా అఫునిసా గ్యారేజ్‌ ప్రచారం పొందింది. కస్టమర్లు ఆమె గ్యారేజ్‌ సేవలను విశ్వసిస్తున్నారు. అన్నింటికి మించి మహిళలను అరుదుగా కనిపించే ఈ రంగంలో ఆమె సమర్థంగా నిలదొక్కుకోవడం వెనుక ఆమెకు ఆ రంగం పట్ల ఉన్న ఆసక్తి, విశేష అనుభవం కారణం అని అర్థం చేసుకున్నారు. ‘క్యాబిన్‌లో కూచుని చేసే ఉద్యోగంలో లేని థ్రిల్లు ఒక కారులో కనిపించే జటిలమైన సమస్యను రిపేర్‌ చేసినప్పుడు కలుగుతుంది.’ అంటుంది అఫునిసా.

వైట్‌కాలర్‌ కెరీర్‌లు చాలానే ఉంటాయి.కాని చేతులకు గ్రీజ్‌ పూసుకొని పెట్రోల్‌ వాసనల మధ్య పని చేయడంలో ఒక గొప్ప ఉత్సాహాన్ని పొందుతోంది అఫునిసా. ఆమె కొత్త పనిని ఎంచుకుంది. అందుకే మీరిక్కడ ఆమె గురించి చదువుతున్నారు.కేబిన్‌లో కూచుని అందరిలా ఉద్యోగం చేస్తే ఎందుకు రాస్తారంట.
 

మరిన్ని వార్తలు