Chess Pieces Dance Video: రాజమౌళి మూవీని మించిన వీడియో.. శభాష్‌ అంటూ సీఎం, ప్రముఖుల ప్రశంస

31 Jul, 2022 11:52 IST|Sakshi

దేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ చెస్‌ మహా సంగ్రామానికి తమిళనాడు రాజధాని చెన్నై నగరం వేదికైంది. నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాగా పోటీలు జూలై 29వ తేదీ నుంచి ఆగస్టు 10వరకు జరుగుతా యి. వీటిలో పాల్గొనేందుకు భారత్‌తోపాటూ అమెరికా, ఉక్రెయిన్, జర్మనీ, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా , మలేషియా, ఒమన్, డెన్మార్క్‌ తదితర 162 దేశాల నుంచి 1,735 మంది క్రీడాకారులు వచ్చారు. 

ఇదిలా ఉండగా.. చెస్‌ ఒలంపియాడ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చెస్‌ బోర్డుపై పావుల స్థానంలో మనుషులే పాత్రధారులైతే ఎలా ఉంటుందో ఓ వీడియో రూపంలో తెరకెక్కించారు. చెస్‌ బోర్డులో రాజు, మంత్రిగా, సైనికులుగా, గుర్రాలుగా, ఒంటెలుగా, ఏనుగులుగా మనుషులే వేషం ధరించి కదులుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నట్టుగా వీడియోను రూపొందించారు. 

కాగా, తమిళనాడులోని పుదుక్కొట్టాయ్ కలెక్టర్ కవితా రాము స్వయంగా కొరియో గ్రఫీతో ఈ వీడియోకు ప్రాణం పోశారు. ఈ వీడియోను చూసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ప్రశంసలు కురిపించారు. జిల్లా అధికార యంత్రాంగం చెస్ ఒలింపియాడ్ 2022ను ప్రచారం చేయడానికి ఎన్నో వినూత్న చర్యలు చేపట్టిందని మెచ్చుకున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ‘ఇదో అద్భుతం. చదరంగంలో పావులు సజీవంగా వస్తే ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇది ప్రామాణికతను కలిగి ఉంది. మన దేశంలో కనుగొనబడిన గేమ్ ఇది’ అంటూ ట్విట్టర్‌ వేదికగా కామెంట్స్‌ చేశారు.

ఇది కూడా చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి!.. ట్రాఫిక్‌ పోలీసులనే తికమక పెట్టాడు

మరిన్ని వార్తలు