Chhattisgarh: ‘లిక్కర్‌ ప్రజలను ఏకం చేస్తుంది.. కానీ’.. మంత్రి సలహాపై దుమారం

1 Sep, 2022 16:16 IST|Sakshi

రాయ్‌పుర్‌: మద్యం సేవించటం ద్వారా కుటుంబాలు రోడ్డు పాలవుతాయని పెద్దలు చెబుతుంటారు. లిక్కర్‌కు దూరంగా ఉండాలని కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇస్తుంటాయి ప్రభుత్వాలు. మద్యం హానికరం అని లిక్కర్‌ సీసాలపై పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటుంది. కానీ, డి-అడిక్షన్‌ కార్యక్రమం వేదికగా ఛత్తీస్‌గఢ్‌ పాఠశాల విద్యాశాఖ మంత్రి ప్రేమ్‌సాయి సింగ్‌ టెకమ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. లిక్కర్‌ ప్రజలను ఏకం చేస్తుందని, అయితే, కొద్ది మోతాదులో తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.  

‘నశా ముక్త్‌ అభియాన్‌’లో భాగంగా వద్రాఫ్‌నగర్‌లో డి-అడిక్షన్‌ కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. పలు పాఠశాలలకు చెందిన పిల్లలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం వేదికగా లిక్కర్‌ ప్రజలను ఏకం చేస్తుందటూ మంత్రి చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘ నేను ఓ మీటింగ్‌కు హాజరయ్యాను. అక్కడ ఓ వర్గం లిక్కర్‌ అనారోగ్యానికి గురిచేస్తుందని, దానిని తాగటం మంచిది కాదని వాదించింది. మరోవర్గం.. లిక్కర్‌ వల్ల లాభాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, లిక్కర్‌ ప్రతిఒక్కరిని కలుపుతుంది. కానీ, నియంత్రణ ఉండాలి. మనం సైతం ఉత్సవాలు, ఎన్నికల సమయంలో దానిని ఉపయోగిస్తాం. ’ అని పేర్కొన్నారు టెకమ్.

బీజేపీ విమర్శలు..
లిక్కర్‌పై రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుట్టారు బీజేపీ ఎమ్మెల్యే అజయ్‌ చంద్రాకర్‌. ‘భూపేశ్‌ బఘేల్‌ జీ ప్రభుత్వం, పార్టీ కార్టూన్లతో నిండిపోయింది. ఏఒక్కరికి విషయం అర్థంకాదు. ఇది పని చేసే ప్రభుత్వం కాదు. ఢిల్లీ(కాంగ్రెస్‌ అధిష్ఠానం) చేతిలో కీలుబొమ్మ. ’ అని ఆరోపించారు. మరోవైపు.. కొద్ది రోజుల క్రితం భంగ్‌, గంజాయీని లిక్కర్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించాలని బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణమూర్తి బంధి వ్యాఖ్యానించిన తర్వాత రాష్ట్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన‍్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: Jharkhand Crisis: గవర్నర్‌ను కలవనున్న అధికార కూటమి నేతలు

మరిన్ని వార్తలు