Bird Flu Outbreak: కడక్‌నాథ్‌ కోళ్లకు బర్డ్‌ఫ్లూ.. చికెన్ విక్రయాలపై నిషేధం!

26 Feb, 2023 10:06 IST|Sakshi

జార్ఖండ్‌: బర్డ్‌ఫ్లూ కారణంగా 4,000 కోళ్లు, బాతులను చంపివేయాలని జార్ఖండ్ బొకారో జిల్లా అధికారులు నిర్ణయించారు. ఇక్కడ ప్రభుత్వం నిర్వహించే పౌల్ట్రీ ఫాంలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తిచెందినందువల్ల దాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రోటీన్లు అధికంగా ఉండే కడక్‌నాథ్‌ కోళ్లలో హెచ్‌5ఎన్‌1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఈ రకానికి చెందిన 800 కోళ్లు బర్డ్‌ప్లూ కారణంగా మరణించాయని, మరో 103 కోళ్లను తామే చంపేశామని పేర్కొన్నారు.

దీంతో ఈ ఫాంకు ఒక కిలోమీటర్ రేడియస్‌లో ఉన్న కోళ్లు, బాతులు సహా మొత్తం 3,856 పక్షులను చంపనున్నట్లు పశు ఆరోగ్య, ఉత్పత్తి డైరెక్టర్ డా.బిపిన్ బిహారీ మహ్తా పేర్కొన్నారు. ఫిబ్రవరి 2న ఈ ఫాంలో కోళ్లు చనిపోవడం మొదలైందని, నమూనాలు ల్యాబ్‌కు పంపింతే బర్డ్‌ఫ్లూగా నిర్ధరణ అయిందని వివరించారు. 

అయితే కోళ్ల యజమానులకు కొంత పరిహారం ఇచ్చేందుకు ప్రక్రియ మొదలైందని, ఎవరెవరికి ఇచ్చే విషయాన్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉందన్నారు. బర్డ్‌ఫ్లూను గుర్తించి పౌల్ట్రీ ఫాంకు 10 కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్న కోళ్ల ఫాంలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే బొకారా జిల్లాలో చికెన్ విక్రయాలపై నిషేధం విధించారు. మనుషులు ఎవరైనా ఈ వైరస్ బారినపడితే వారికి చికిత్స అందించేందుకు సదర్ హాస్పిటల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
చదవండి: బర్డ్‌ఫ్లూతో 11 ఏళ్ల బాలిక మృతి.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

మరిన్ని వార్తలు