Russia Ukraine War: యుద్దం ఆపమని పుతిన్‌ను ఆదేశించలేము కదా?

3 Mar, 2022 12:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న కారణంగా అక్కడ ఉన్న విదేశీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్‌ గగనతలాన్ని మూసివేసి విమానాలను రద్దు చేయడంతో విద్యార్థులు స‍్వదేశానికి చేరుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల తరలింపుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిల్‌(ప్రజాహిత వ్యాజ్యం) దాఖలైంది. ఈ పిల్‌పై గురువారం విచారణ జరుగుతున్న సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు చూశానని.. ఓ వీడియోలో భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే విషయంలో సీజేఐ ఏం చేయలేరా అని ప్రశ్నించినట్టు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సీజేఐ స్పందిస్తూ.. విద్యార్థుల పరిస్థితుల పట్ల తమకు కూడా సానుభూతి ఉందని అన్నారు. కానీ.. యుద్దం ఆపమని తాము పుతిన్‌ను ఆదేశించలేము కదా అంటూ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులను తరలించే విషయంలో భారత ప్రభుత్వం నిమగ్నమైందన్నారు. వారి పని వారు చేస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంలో తాము ఏం చేయగలమో అటార్నీ జనరల్‌ సలహాలు, సూచనలతో ముందుకు సాగుతామన్నారు.

మరిన్ని వార్తలు