అల్లోపతిపై విమర్శలేల? 

24 Aug, 2022 04:14 IST|Sakshi

న్యూఢిల్లీ: అల్లోపతి తదితర వైద్య పద్ధతులను విమర్శించడం సరికాదని యోగ గురు బాబా రామ్‌దేవ్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హితవు పలికారు. రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనలపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ రమణ, జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ రవికుమార్‌ల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. రోగుల సమస్యలకు, లక్షలాది మరణాలకు అల్లోపతే కారణమంటూ జారీ చేసిన ప్రకటనలను తీవ్రంగా తప్పుబట్టింది.

కోవిడ్‌ ఉధృతికాలంలో ఇలాంటి పలు ప్రకటనలను పతంజలి సంస్థ జారీ చేసిందని ఐఎంఏ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  ‘రామ్‌దేవ్‌కు ఏమైంది? అల్లోపతిపై తీవ్ర విమర్శలు చేస్తూ, డాక్టర్లంటే ఏదో హంతకులన్నట్టుగా వారందరినీ తప్పుబడుతూ వార్తా పత్రికల్లో భారీ ప్రకటనలా? ఏమిటిది? ఇలా ఎలా చేస్తారు?’’ అంటూ సీజేఐ తప్పుబట్టారు. ‘ఆయనంటే మాకు గౌరవం. యోగాకు ప్రాచుర్యం కల్పించారు. టీవీల్లో రామ్‌దేవ్‌ యోగా ప్రోగ్రాంలను మేమూ చూసేవాళ్లం.

మీ వైద్య విధానం గొప్పదనం గురించి చెప్పుకోవచ్చు. కానీ ఇలా ఇతర వైద్య విధానాలను విమర్శించడం సరికాదు’ అన్నారు. రామ్‌దేవ్‌ అనుసరిస్తున్న ఆయుర్వేదమో, లేదా మరేదైనా విధానమో మాత్రమే అన్ని రోగాలకూ నివారిణి అని గ్యారెంటీ ఇవ్వగలరా అని సీజేఐ ప్రశ్నించారు. ఇలాంటి విమర్శలకు దూరంగా ఉండాలని బాబా రామ్‌దేవ్‌కు సూచించారు. కేంద్రానికి, పతంజలి ఆయుర్వేద సంస్థకు నోటీసులు జారీ చేశారు. కరోనా వ్యాక్సీన్ల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యల విషయంలో ఢిల్లీ హైకోర్టు కూడా గత వారం  రామ్‌దేవ్‌ను మందలించడం తెలిసిందే.  

మరిన్ని వార్తలు